Women’s Reservation Bill : కేంద్రం సంచలన నిర్ణయం.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం
ఈ బిల్లు ఆమోదం పొందితే చట్టసభల్లో (పార్లమెంటు, అసెంబ్లీలలో) మహిళలకు 33శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. Women's Reservation Bill Cleared

Womens Reservation Bill
Women’s Reservation Bill Cleared : ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఈ బిల్లు ఆమోదం పొందితే చట్టసభల్లో (పార్లమెంటు, అసెంబ్లీలలో) మహిళలకు 33శాతం రిజర్వేషన్లు దక్కుతాయి. ఎన్నో దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారు. ఈ బిల్లు ఎప్పుడు ఆమోదం పొందుతుందా? ఎప్పుడు చట్టంగా మారుతుందా? అని మహిళా లోకం నిరీక్షిస్తోంది. ఎట్టకేలకు వారి నిరీక్షణకు తెరపడే సమయం ఆసన్నమైంది.
చట్ట సభల్లో మహిళలకు భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించినదే మహిళా రిజర్వేషన్ బిల్లు. పార్లమెంటులో మొదటిసారి 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. 2008లో రాజ్యసభలో మరోసారి బిల్లును ప్రవేశపెట్టగా.. 2010లో ఆమోదం పొందింది. కానీ లోక్ సభలో సుమారు నాలుగేళ్లు పక్కన పెట్టడంతో వీగిపోయింది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మోదీ సర్కార్ మళ్లీ ఇప్పుడు ఈ బిల్లుపు సభలో ప్రవేశపెట్టనుంది.(Women’s Reservation Bill)
ప్రస్తుత చట్ట సభల్లో మహిళల శాతం ఎంతంటే..
ప్రస్తుతం లోక్ సభలో మహిళా సభ్యుల వాటా 14.94 శాతం. రాజ్యసభలో వారి ప్రాతినిధ్యం 14.05 శాతంగా ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో కేవలం ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 19 రాష్ట్రాల అసెంబ్లీలలో ప్రస్తుతం మహిళా ప్రతినిధుల వాటా 10శాతం లోపే ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే 33శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందితే చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది.
మహిళలకు దక్కే స్థానాలు ఎన్ని?
మహిళా రిజర్వేషన్ బిల్లు కనుక పార్లమెంటులో ఆమోదం పొందితే.. చట్టసభల్లో(పార్లమెంటు, అసెంబ్లీల్లో) మహిళల ప్రాతినిధ్యం భారీగా పెరగనుంది. లోక్ సభలో 545 స్థానాలకు గాను 179 సీట్లు మహిళలకు దక్కుతాయి. ఇక ఏపీలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 58 స్థానాలను కచ్చితంగా మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఇక తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 39 నియోజకవర్గాలను మహిళకే కేటాయించాలి.
సాధారణంగా పార్లమెంటులో ఏడాదికి మూడు సెషన్లు మాత్రమే ఉంటాయి. ఒకటి బడ్జెట్ సెషన్, రెండు వర్షాకాల సమావేశాలు, మూడు శీతాకాల సమావేశాలు. ఈసారి మాత్రం చాలా స్పెషల్. పాత భవనం నుంచి కొత్తగా కట్టిన భవనంలోకి పార్లమెంటు సమావేశాలు మారుస్తున్నారు. ఈరోజు పాత బిల్డింగ్ లో సమావేశాలు జరిగాయి. ఈరోజు జరిగిన సమావేశాలు చివరి సమావేశాలు. కొత్త బిల్డింగ్ లోకి వెళ్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రత్యేక పార్లమెంటు సెషన్ ఏర్పాటు చేసింది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ ప్రత్యేక సెషన్ లో కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఏ బిల్లును అయినా పార్లమెంటులో ప్రవేశపెట్టాలి అంటే.. అంతకన్నా ముందుగా జరగాల్సిన ముఖ్యమైన ప్రక్రియ ఆ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించాల్సి ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది.
కాగా, ఈసారి మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేవలం అధికారంలో ఉన్న బీజేపీనే కాదు చాలా రాజకీయ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో బిల్లు ఆమోదం పొందే ఛాన్స్ అధికంగా ఉంది.