Sunderlal Bahuguna : కరోనాతో కన్నుమూసిన చిప్కో ఉద్యమ నేత సుందర్ లాల్ బహుగుణ

ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ(94) క‌న్నుమూశారు.

Sunderlal Bahuguna :  కరోనాతో కన్నుమూసిన చిప్కో ఉద్యమ నేత సుందర్ లాల్ బహుగుణ

Chipko Movement Founder Sunderlal Bahugana Dies Of Covid 19

Sunderlal Bahugana ప్రముఖ పర్యావరణవేత్త, చిప్కో ఉద్యమకారుడు సుందర్‌లాల్ బహుగుణ(94) క‌న్నుమూశారు. మే-8న సుందర్‌లాల్ బహుగుణ కరోనా బారిన పడ్డారు. దీంతో ట్రీట్మెంట్ కోసం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేశ్‌ లోని ఎయిమ్స్‌(AIIMS)లో చేరారు. ఇప్పటికే డయాబెటిస్, న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన కరోనా నుంచి కోలుకోపోయారు. గత రాత్రి ఆయన పరిస్థితి విషమించిందని,ఆక్సిజన్ లెవల్స్ తీవ్రంగా పడిపోయాయని..శుక్రవారం మధ్యాహ్నం 12.05 నిమిషాల‌కు బ‌హుగుణ తుదిశ్వాస విడిచిన‌ట్లు ఎయిమ్స్ రిషికేశ్‌ డైర‌క్ట‌ర్ ర‌వికాంత్ తెలిపారు. ఇన్నాళ్లూ హాస్పిటల్ లోని ఐసీయూలో ఆయ‌న CAPA థెర‌పీలో ఉన్నారని చెప్పారు. శనివారం రిషికేశ్‌లోని గంగానది ఒడ్డున బహుగుణ అంత్యక్రియలను నిర్వహిస్తారని సమాచారం.

సుందర్‌లాగ్ బహుగుణ మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ‌తాబ్ధాలుగా ప్ర‌కృతితో స‌హ‌జీవ‌నం చేసే మ‌న జీవిన విధానానికి బ‌హుగుణ తార్కాణ‌మ‌ని మోడీ అన్నారు. సుంద‌ర్‌లాల్ మృతి దేశానికి భారీ న‌ష్ట‌మ‌ని, తీర‌ని లోటని అన్నారు. ఆయ‌న మృదుస్వ‌భావాన్ని,పర్యావరణ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని ఎన్న‌టికీ మ‌ర‌వ‌లేమ‌ని మోడీ ట్వీట్ లో తెలిపారు. బ‌హుగుణ కుటుంబ‌స‌భ్యుల‌కు, ఆయ‌నను ఇష్ట‌ప‌డేవారికి ప్ర‌ధాని మోడీ సానుభూతి వ్య‌క్తం చేశారు.

కాగా,ఉత్త‌రాఖండ్‌లోని గ‌ర్వాల్ ప్రాంతంలో ఉన్న “మ‌రోడా” సుందర్ లాల్ బహుగుణ స్వ‌గ్రామం. సుందర్‌లాల్ బహుగుణకు పచ్చని చెట్లు.. పర్యావరణం అంటే ఎంతో ప్రేమ. హిమాలయాల్లో అడవుల నరికివేతకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు చేశారు. పర్యావరణ గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో 1974లో చిప్కో(హత్తుకోవడం అని అర్థం) ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. 1970 ల్లో నిర్లక్ష్యంగా చెట్లను నరికివేయడం ప్రజల జీవనోపాధిని ప్రభావితం చేయడం ప్రారంభించినప్పుడు, ఉత్తరాఖండ్ లోని చమోలి ప్రాంతంలోని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేయడం ప్రారంభించారు.

1974 జనవరిలో అలకానంద నదికి ఎదురుగా ఉన్న 2,500 చెట్లను వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించినప్పుడు ఈ చిప్కో ఉద్యమం ప్రారంభమైంది. చాలా శాంతియుతంగా సుందర్ లాల్ బహుగుణ ఆ ఉద్య‌మాన్ని సాగించారు. చెట్లను హత్తుకుంటూ..వాటి గొప్పతనాన్ని ప్రజలకు వివరిస్తూ ఉద్యమాన్ని నడిపించారు. ఈ చిప్కో ఉద్యమం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీకి ఆయన చేసిన విజ్ఞప్తి ఫలితంగా 1980 లో… పచ్చని చెట్లను నరికివేయడంపై ప్రభుత్వం 15 సంవత్సరాల నిషేధం విధించింది.

తర్వాత 1980లో భాగీరథి నదిపై ఉత్తరాఖండ్‌లో తెహ్రీ ఆనకట్ట నిర్మించడాన్ని నిరసిస్తూ సత్యాగ్రహ, నిరాహార దీక్షలు వంటి గాంధేయ పద్ధతులను ఉపయోగించారు సుందర్‌లాల్ బహుగుణ. పర్యావరణ కోసం ఆయన చేసిన సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. 1981లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. 2009లో పద్మ విభూషణ్‌ కూడా సుందర్‌లాల్ బహుగణను వరించింది.