కేంద్రం గుడ్‌న్యూస్…వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌

  • Published By: venkaiahnaidu ,Published On : September 17, 2020 / 04:32 PM IST
కేంద్రం గుడ్‌న్యూస్…వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్‌

కరోనా వైరస్‌ కేసులు వేగంగా ప్రబలుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ కోసం వేచిచూసే కోట్లాది భారతీయులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. భారత్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ ‌రాజ్యసభలో ప్రకటించారు. ఇతర దేశాల మాదిరిగానే భారత్‌ కూడా వ్యాక్సిన్‌ ప్రయత్నాల్లో నిమగ్నమైందని, మూడు దేశీ కోవిడ్‌-19 వ్యాక్సిన్ ‌లు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు.

కరోనా తాజా పరిస్ధితిపై రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ … ఒకప్పుడు మాస్కులు, పీపీఈ కిట్లు లేవనే విమర్శలు వచ్చాయని, కానీ ఇప్పుడు ప్రజలు అంతకు మించిన సమస్యలు ఎదుర్కొనే పరిస్ధితులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో కరోనా వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది ప్రధమార్దంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామన్నారు.


వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్‌ చేసిన ప్రకటనపై స్పందిస్తూ…దీనిపై తొందరపాటు అవసరం లేదని, ఏమాత్రం తేడా వచ్చినా యువకుల జనాభా అధికంగా ఉన్న భారత్‌పై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. భారత్ ‌కు తక్కువ ధరలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చే సత్తా ఉందన్నారు. కరోనాను కట్టడి చేసే అంశంపై జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆజాద్‌.. కేంద్రం విలువైన సమయాన్ని వృధా చేసిందని, గతేడాది డిసెంబర్లో ప్రపంచ ఆరోగ్యసంస్ధ హెచ్చరికలను పట్టించుకుని ఉంటే ఇలాంటి పరిస్ధితి వచ్చేది కాదన్నారు.


కాగా, భారత్‌ లో జైడస్‌ క్యాడిలా, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేస్తున్న కరోనా ‌ వ్యాక్సిన్ ‌లు రెండూ తొలి దశ పరీక్షలను పూర్తి చేసుకున్నాయి. ఇక డీసీజీఐ అనుమతులు లభించిన వెంటనే ఆస్ర్టాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేసే వ్యాక్సిన్‌ రెండు, మూడవ దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధమైంది.