లక్షా 50వేలు కరెంట్ బిల్లు, ఉరేసుకుని రైతు ఆత్మహత్య

లక్షా 50వేలు కరెంట్ బిల్లు, ఉరేసుకుని రైతు ఆత్మహత్య

electricity bill kills farmer: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు నిండు ప్రాణం తీసింది. వారు చేసిన తప్పు ఆ అన్నదాత ఉసురుతీసింది. తప్పు చేయడమే కాకుండా రైతుని అందరిముందు అవమానించారు. ఇది తట్టుకోలేక ఆ రైతు ఉరేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.

అలీగఢ్ జిల్లాలోని సునారా గ్రామాంలో నివాసం ఉండే రాంజీ లాల్(50) ఓ రైతు. వ్యవసాయమే జీవనాధారం. కాగా, అతడికి కరెంటు బిల్లు 1.5 లక్షలు వచ్చింది. ఈ బిల్లు చూసి రాంజీ లాల్ షాక్ తిన్నాడు. వెంటనే విద్యుత్ అధికారులను ఆశ్రయించాడు. తనకు ఇంత కరెంటు బిల్లు రాదని చెప్పాడు. ఇంత బిల్లు కట్టే స్తోమత తనకు లేదన్నాడు. ఓసారి రికార్డులు చెక్ చేసి చూడాలని అధికారుల కాళ్లు పట్టుకుని బతిమాలాడు.

అయితే, విద్యుత్ శాఖ సిబ్బంది రైతు విన్నపాన్ని పట్టించుకోలేదు. పైగా అవమానంగా అనిపించింది. కరెంటు బిల్లు కట్టాలని ఇంటికి వచ్చిన సిబ్బంది.. మమ్మల్నే తప్పు పడతావా అంటూ కుటుంబసభ్యుల ముందే రైతుని కొట్టారు. కరెంటు బిల్లు ఎంతొచ్చిందో అంత కట్టాల్సిందేనని తేల్చి చెప్పారు. తాను తప్పు చేయకపోయినా, తన కుటుంబం ముందు తనను అవమానించినందుకు తీవ్రంగా కుంగిపోయిన రైతు తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. మనస్తాపంతో ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు.

రైతు ఆత్మహత్యతో గ్రామంలో ఉద్రిక్త నెలకొంది. గ్రామస్తులు కోపంతో ఊగిపోయారు. విద్యుత్ శాఖ సిబ్బంది దురుసుతనం, నిర్లక్ష్యం కారణంగానే రాంజీలాల్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతడి మృతదేహంతో విద్యుత్ ఆఫీసు ముందు ధర్నాకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై పోలీసు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ తమ చేతికి ఇచ్చే వరకు తాము కదలబోమని భీష్మించారు. దీనిపై బాధితుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యుత్ సిబ్బంది తప్పు చేశారని, తమకు రూ.1500 బిల్లు వస్తే దాన్ని రూ.1,50,000 వేశారని, అంతేకాకుండా దీన్ని నిలదీసిన రాంజీని కొట్టారని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై విచారణ జరిపి తప్పు చేసినట్టు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పారు.

వాస్తవానికి ఆ రైతుకి రావాల్సిన కరెంట్ బిల్లు రూ.1500. కానీ, అధికారుల నిర్లక్ష్యంగా రూ.1,50,000 అని ప్రింట్ అయ్యిందని గ్రామస్తులు చెబుతున్నారు. వారి నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం పోయిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.