అన్నదాతల ఆందోళన : రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

అన్నదాతల ఆందోళన : రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

Supreme Court : వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీ సరిహద్దుల్లో రోడ్లపై ఆందోళన చేస్తున్న రైతులను ఖాళీ చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టింది. రహదారుల దిగ్బంధనంపై రైతు సంఘాలకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది.

రైతు సంఘాలతో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపాలని సుప్రీం కోర్టు కేంద్రానికి సూచించింది. ప్రతిష్టంభనను తొలగించడానికి రైతలు, ప్రభుత్వ ప్రతినిధులతో ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సూచించింది. రైతుల చేస్తున్న ఆందోళన దేశ ప్రయోజనాలకు సంబంధించినదని..సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. రేపు రైతుల వాదనలు వింటామని తెలిపింది. తుదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులోరైతుల ఆందోళన 21వ రోజుకు చేరుకుంది. ఇన్ని రోజులుగా నిరసన చేస్తున్నా తమ డిమాండ్లపై కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని రైతు సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. రిలే నిరాహార దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. అదే సమయంలో కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయకపోతే ఈ నెల 19 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని రైతులు ఇప్పటికే హెచ్చరించారు.

ఢిల్లీ సరిహద్దుల్లో రోజు రోజుకు నిరసనకారుల సంఖ్య పెరుగుతోంది. సింఘు, టిక్రీ, గాజీపూర్ సరిహద్దుల్లో వేలాదిగా నిరసనకారులు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు స్పష్టం చేశారు. ఢిల్లీ-నోయిడా జాతీయ రహదారి మినహా మిగిలిన అన్ని మార్గాలను రైతులు మూసివేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు.

ఓ వైపు ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నప్పటికీ… ఎముకలు కొరికే చలిలో కూడా రైతులు వెన్నుచూపడం లేదు. ఇప్పటికే సింఘు, టిక్రి, ఘాజీపూర్, జైపూర్ సహా పలు రహదారులను రైతులు మూసివేశారు. పంజాబ్, హరియాణా, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం నుంచి ఢిల్లీ-నోయిడా రహదారి కూడా మూసివేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఈరోజు జరుగుతున్న కేంద్ర కేబినెట్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసనలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని సమాచారం. పంటలకు కనీస మద్దతు ధర అంశంపైనే ప్రధానంగా మంత్రివర్గంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.

అలాగే కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై కార్య నిర్వాహక ఉత్తర్వులను కేబినెట్‌ జారీ చేసే అవకాశం ఉంది. అలాగే మార్కెట్ బయట లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను కేంద్రం రూపొందించే అవకాశం ఉంది.

రైతుల నిరసనలతో దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం కనిపిస్తోందని భారత ట్రేడ్ అసోసియేషన్ అసోచామ్ ఆందోళన వ్యక్తం చేసింది. అన్నదాతల ఆందోళనల వల్ల సరఫరా దెబ్బతినడంతో రోజుకు 3 వేల 500 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లుతోందని అసోచామ్ అంచనా వేసింది.