తమిళనాడులో వరుసగా బాణసంచా పేలుళ్లు.. గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు

తమిళనాడులో వరుసగా బాణసంచా పేలుళ్లు.. గాల్లో కలుస్తున్న అమాయకుల ప్రాణాలు

Fireworks explosions in Tamil Nadu : తమిళనాడులో వరుసగా జరుగుతున్న బాణసంచా పేలుళ్లు కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కార్మికుల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పొట్టకూటి కోసం పనికెళ్తే.. వారి ప్రాణాలమీదకు వస్తోంది. ఈనెలలో జరిగిన రెండు ఘటనల్లో 29మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో మరికొంత మంది కార్మికులు గాయాలపాలయ్యారు. శివకాశిలో నిన్న కర్మాగారంలో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.

వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం సమయంలో ఒక్కసారి గా పేలుడు జరిగింది. ఆ సమయంలో ఫ్యాక్టరీలో చాలా మంది కార్మికులు పని చేస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ఇటీవల శివకాశిలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇదే నెల 12వ తేదీన విరుద్‌నగర్‌ జిల్లాలోనూ ఓ బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏకంగా 23 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ రెండు ఘటనలు రెండు వారాల వ్యవధిలోనే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విరుద్‌నగర్‌ జిల్లా అచ్చమంగళంలోని బాణసంచాలో అగ్నిప్రమాదం జరిగినట్టు తమిళనాడులో పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. అధికారపక్షంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

తమిళనాడులో క్రాకర్స్‌ పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయని విపక్షాలు ఆరోపించాయి. అధికారుల నిర్లక్ష్యానికి అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి. టపాకాయల కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయినా పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఇది గడిచి రెండు వారాలు గడవకుండానే మరో ప్రమాదం జరిగి… ఆరుగురి ప్రాణాలను బలితీసుకుంది.

దేశం మొత్తంలో బాణసంచా తయారీ పరిశ్రమలు తమిళనాడులోనే భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడి నుంచే క్రాకర్స్‌ సప్లై అవుతుంటాయి. అయితే బాణసంచా పరిశ్రమల యజమాన్యాలు లాభాల కోసం అమాయకులను బలిపెడుతున్నాయన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా…. క్రాకర్స్‌ తయారు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బాణసంచా తయారీ సందర్భంగా కార్మికులకు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు.

దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావుడి చేసే అధికారులు.. ఆ తర్వాత వాటిపై నిఘా పెట్టడం లేదు. చూసీచూడనట్టు వదిలేస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో కార్మికుల మృతికి యాజమాన్యాల లాభాపేక్షతోపాటు…అధికారుల నిర్లక్ష్యం కారణమవుతోంది.