వచ్చే 5ఏళ్లలో 102లక్షల కోట్ల మౌళిక వసతుల ప్రాజెక్టులు

  • Published By: venkaiahnaidu ,Published On : December 31, 2019 / 02:01 PM IST
వచ్చే 5ఏళ్లలో 102లక్షల కోట్ల మౌళిక వసతుల ప్రాజెక్టులు

మౌళిక సదుపాయల ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ప్రధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కూడా ఉంది. 2025 నాటికి 5ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ లక్ష్యాన్ని సాధించడంలో భాగంగా మౌళిక వసతుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 102 లక్షల కోట్లు కేటాయించినట్లు ఆమె తెలిపారు. ఇవాళ మంత్రి ఆర్థిక శాఖ వార్షిక నివేదికను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మౌళిక వసతుల రంగానికి కేంద్రం పెద్దపీట వేస్తుందనీ, మౌళిక వసతుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 102 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ నాలుగు నెలల్లోనే 70 సంప్రదింపుల సమావేశాలు నిర్వహించి, రూ.102 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించిందన్నారు. 2019 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ రాబోయే 5ఏళ్లలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో సుమారు రూ.100 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెడతామని చెప్పారని, దీనికి అనుగుణంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ నాలుగు నెలల్లో 70 సంప్రదింపుల సమావేశాలు నిర్వహించిందని నిర్మల సీతారామన్ చెప్పారు. ఈ టాస్క్‌ఫోర్స్ రూ.102 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను గుర్తించిందన్నారు.
 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ ప్రతినిథులతో నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ కో-ఆర్డినేషన్ మెకానిజమ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2020 జూలై తర్వాత వార్షిక అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. పునరుద్ధరణీయ ఇంధనాలు, రైల్వేలు, పట్టణాభివృద్ధి, సాగునీటి పారుదల, విద్య, వైద్యం, ఆరోగ్యం, సురక్షిత తాగునీరు, డిజిటల్ సెక్టర్ తదితర రంగాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించామని ఆమె అన్నారు.