చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత

  • Published By: murthy ,Published On : May 29, 2020 / 10:47 AM IST
చత్తీస్ ఘడ్ మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత

చ‌త్తీస్‌ఘ‌డ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ చత్తీస్ ఘడ్ (జే) పార్టీ అధ్యక్షుడు, రాష్ట్రానికి తొలి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన సీనియ‌ర్‌ నేత అజిత్ జోగి కన్ను మూశారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. గత కొన్ని రోజులుగా అస్వస్ధతతో ఉన్న ఆయన రాయ్ పూర్ లోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు.  అజిత్ జోగి మృతి చెందినట్లు ఆయన కుమారుడు అమిత్ జోగి ట్వీట్ చేశారు. 

అజిత్ జోగి రాజ‌కీయాల్లోకి రాక‌ముందు క‌లెక్ట‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఆయ‌న రెండుసార్లు రాజ్య‌స‌భ‌కు ఎ‌న్నిక‌య్యారు. భోపాల్‌లోని మౌలానా ఆజాద్ టెక్నాల‌జీ కాలేజీలో జోగి మెకానిక‌ల్ ఇంజినీరింగ్ చేశారు. 1968లో ఆయ‌న యూనివ‌ర్సిటీ గోల్డ్ మెడ‌ల్ సాధించారు.  

రాయ్‌పూర్‌లోని నేష‌న‌ల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో కొన్నాళ్ల పాటు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేశారు. రాజకీయాల్లో చేరటానికి ముందు ఆయన మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి వివిధ హోదాల్లో పని చేశారు. 

1986-1998 మధ్యకాలంలో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా  సేవలందించారు. 1998 లోక్ సభ ఎన్నికల్లో  రాయ్ గడ్ నియోజక వర్గం నుంచి, 2004 ఎన్నికల్లో మహసముండ్ నియోజక వర్గం నుంచి గెలుపొంది పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. 1998 నుంచి 2000 మధ్యకాలంలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. 2008 లో మార్వాహి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 

అజిత్ జోగికి  మే9న గుండెపోటు రావటంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆయనకు రెండు సార్లు హార్ట్ ఎటాక్ వచ్చింది.  అజిత్ జోగి ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉన్నట్లు అంతకు ముందు డాక్టర్లు ప్రకటించారు.

చత్తీస్ ఘడ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2000 సంవత్సరం నుంచి 2003 వ సంవత్సరం వరకు ఆయన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని  అభియోగం మీద  అజిత్ జోగి, ఆయన కుమారుడు అమిత్ జోగిలపై కాంగ్రెస్ పార్టీ ఆరేళ్లపాటు బహిష్కరణ వేటు వేయటంతో… 2016 జూన్ 23న  సొంతంగా జనతా కాంగ్రెస్ చత్తీస్ ఘడ్(జే) ను ఏర్పాటుచేశారు.

 

Read:  ప్రధాని మోడీతో హోం మంత్రి అమిత్ షా భేటీ