సల్మాన్ కు చెందిన గుర్రం అమ్ముతామని మోసం, హైకోర్టు మెట్లు ఎక్కిన మహిళ

సల్మాన్ కు చెందిన గుర్రం అమ్ముతామని మోసం, హైకోర్టు మెట్లు ఎక్కిన మహిళ

Horse Owned by Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరిట గుర్రాన్ని విక్రయిస్తామని చెబుతూ..ఓ మహిళను మోసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దీంతో తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమంటూ…పోలీసులను ఆశ్రయించింది. అక్కడ రెస్పాండ్ సరిగ్గా లేకపోయేసరికి హైకోర్టు మెట్లు ఎక్కిందామె.

వివరాల్లోకి వెళితే…

జోధ్ పూర్ ప్రాంతానికి చెందిన మహిళ సంతోశ్ భాటికి గుర్రాలంటే ఇష్టం. ఈమె ఆసక్తిని కొంతమంది గమనించారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చెందిన ఓ గుర్రం అమ్మకానికి ఉందని..అమ్మి పెడుతామని ఆమెను నమ్మించారు. ఆయనకు సంబంధించిన గుర్రాలను తాము గతంలో అమ్మామని, అంతేకాదు..సల్మాన్ ఖాన్ గుర్రాలతో కలిసి దిగిన ఫొటోలు చూపించడంతో మరోమాట అనకుండానే..సంతోష్ భాటి నమ్మింది. వారు చూపించిన గుర్రం కొనేందుకు అంగీకరించింది.

పలు దఫాలుగా చర్చల అనంతరం రూ. 12 లక్షలకు బేరం కుదిరింది. ఈ ధరకు కొనుక్కొని మరింత ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చారు. బుట్టలో పడిన ఆమె..రూ. 11 లక్షల నగదు, రూ. లక్ష చెక్ ఇచ్చింది. డబ్బులు తీసుకున్న తర్వాత..వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కొద్ది రోజులు వెయిట్ చేసింది. వచ్చిన ముగ్గురూ ఎంతకీ గుర్రాన్ని తీసుకొచ్చి..ఆమెకు ఇవ్వలేదు. అప్పుడు తాను మోసపోయినట్లు గుర్తించింది. 2020, ఆగస్టు నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెలలైనా..తన ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు లేకపోయేసరికి..ఇక లాభం లేదంటూ..రాజస్థాన్ హైకోర్టు తలుపు తట్టింది. సమగ్రంగా, పారదర్శకంగా తన కేసును దర్యాప్తు చేయాలని పిటిషన్‌ వేశారు. గురువారం దీనిని విచారణ చేపట్టింది. సంబంధిత పోలీస్ అధికారికి ఈ కేసు గురించి తెలియచేయాలని, చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి..గుర్రం ఇప్పిస్తామన్న వారు ఎక్కడున్నారో ? వారిని పట్టుకుంటారా ? ఆమెకు డబ్బు అందుతుందా ? అనేది చూడాలి.