Gujarat-Himachal Pradesh Election Counting 2022: గుజరాత్‌లో బీజేపీ… హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుపు.. (Live Updates)

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. గుజరాత్‌లో బీజేపీ గెలుపొందగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.

Gujarat-Himachal Pradesh Election Counting 2022: గుజరాత్‌లో బీజేపీ… హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుపు.. (Live Updates)

Election Counting1

Gujarat – Himachal Pradesh Election Counting 2022 : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ సిబ్బంది ఓట్ల లెక్కింపు చేపట్టారు. గుజరాత్ రాష్ట్రంలో 37 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఈ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను 1,621 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా 10వేల మంది భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. గుజరాత్‌లో బీజేపీ గెలవగా… హిమాచల్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 08 Dec 2022 08:47 PM (IST)

    ఎన్నికైన వారందరూ షిమ్లాలోనే ఉండండి: కాంగ్రెస్

    హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ షిమ్లాలోనే ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ సహా కాంగ్రెస్ నేతలు భూపేంద్ర హూడా, రాజీశ్ శుక్లా రేపు షిమ్లాలో కొత్త ఎమ్మెల్యేలతో సమావేశం అవుతారు. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహకాలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురిచేయకుండా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటోంది.

  • 08 Dec 2022 07:43 PM (IST)

    నా రికార్డు బ్రేక్ అవుతుందని ముందే చెప్పాను: గుజరాత్ ఎన్నికల ఫలితాలపై మోదీ

    తన రికార్డ్ బ్రేక్ అవుతుందని ప్రజలతో ముందే చెప్పానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విక్టరీ సాధించింది. దీనిపై మోదీ పై విధంగా స్పందించారు. ఫలితాల అనంతరం నిర్వహించిన కృతజ్ణతా సభలో మోదీ మాట్లాడుతూ కష్టించి పని చేసి పనిలో కూడా తన రికార్డు బ్రేక్ అవుతుందని, ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అది చేసి చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తం 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీ 156 స్థానాలు గెలుచుకుంది.

  • 08 Dec 2022 07:43 PM (IST)

    తెలంగాణలోనూ గెలుస్తాం: బండి సంజయ్

    గుజరాత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో తెలంగాణలోనూ గెలుస్తామని చెప్పారు. ఎన్నికల వేళ ప్రధాని మోదీపై ప్రతిపక్షాలు ఎన్నో వ్యాఖ్యలు చేశాయని, వారి కుట్రలు ఫలించలేదని అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమ పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పారు.

  • 08 Dec 2022 06:53 PM (IST)

    ఓట్ల లెక్కింపు ముగింపు

    గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. గుజరాత్ లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ 156 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35.

  • 08 Dec 2022 06:34 PM (IST)

    హిమాచల్ ప్రదేశ్ తుది ఫలితాలు ఇవి

    హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ కేవలం 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక స్వతంత్రులు మూడు స్థానాలు గెలుచుకున్నారు. ఓట్ బ్యాంకు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం రాగా బీజేపీకి 43 శాతం వచ్చాయి. ఇరు పార్టీల మధ్య ఓట్ బ్యాంకులో అతి స్వల్ప తేడానే ఉన్నప్పటికీ సీట్ల విషయంలో భారీ తేడా కనిపిస్తోంది. చాలా స్థానాల్లో అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ఫలితాలు చూస్తే తెలుస్తోంది.

  • 08 Dec 2022 06:31 PM (IST)

    Gujarat Polls: ఈసీ ప్రకటించిన తుది ఫలితాలు

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 156 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలు సాధించింది. ఇక త్రిముఖ పోటీలో భాగంగా ఉన్న ఆప్ ఐదు స్థానాల్లో గెలిచింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక ఓట్లు సాధించింది. ఆ పార్టీకి 52.5 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ 27.3 శాతం, ఆప్ 12.9 శాతం ఓట్లు సాధించాయి. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలు గెలుచుకోగా సమాజ్‭వాదీ పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది.

  • 08 Dec 2022 06:29 PM (IST)

    అందుకే గెలిచాం: ఖర్గే

    హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో తమ పార్టీ గెలుపునకు గాంధీ కుటుంబమే కారణమని ఖర్గే చెప్పారు. రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర కూడా తమ పార్టీ గెలుపునకు కారణమైందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్న తమ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీకి కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులు కూడా తమకు ఉన్నాయని చెప్పారు. ఈ విజయాన్ని అందించినందుకు ప్రజలు, తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు.

  • 08 Dec 2022 05:51 PM (IST)

    ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతాం: రాహుల్ గాంధీ

    హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును నిర్ణయాత్మక గెలుపుగా ఆయన అభివర్ణించారు. తమ పార్టీ నేతలు కష్టపడి పనిచేసిన తీరుకి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించారని చెప్పారు. ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతామని మరోసారి భరోసా ఇస్తున్నట్లు తెలిపారు.

  • 08 Dec 2022 05:01 PM (IST)

    హిమాచల్ ముఖ్యమంత్రి పదవికి జైరాం ఠాకూర్ రాజీనామా

    హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి జైరాం ఠాకూర్ రాజీనామా చేశారు. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కు రాజీనామా లేఖను అందించినట్లు ఆయన మీడియాకు చెప్పారు.

  • 08 Dec 2022 04:50 PM (IST)

    మీ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నాకు క్లిష్టతరం: థరూర్

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదాలో కొనసాగడానికి ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ కు హస్తం పార్టీ అధిష్ఠానం అవకాశం ఇవ్వలేదు. ఆ పార్టీ గుజరాత్ లో ఘోరంగా ఓడిపోవడంతో ఈ విషయంపై ఆయన స్పందనను మీడియా అడగగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను గుజరాత్ స్టార్ క్యాంపెయినర్ గా కొనసాగలేదు. అలాగే, ఆ రాష్ట్రంలో ప్రచారంలోనూ నేను పాల్గొనలేదు. దీంతో, ఈ ఫలితాలపై స్పందన ఏంటని మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నాకు క్లిష్టతరం’’ అని శశి థరూర్ అన్నారు.

  • 08 Dec 2022 04:44 PM (IST)

    మెజారిటీ మార్క్ దాటిన బీజేపీ.. ఇక ప్రభుత్వ ఏర్పాటే తరువాయి

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ మార్కును దాటింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించిన ఫలితాల ప్రకారం.. సాయంత్రం 4:40 గంటలకు 103 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వాస్తవానికి గుజరాత్‭లో ప్రభుత్వ ఏర్పాటుకు 93 స్థానాలు మాత్రమే అవసరం. ఆ మార్కును బీజేపీ సునాయాసంగా దాటింది. మరో 53 స్థానాల్లో లీడింగులో ఉంది. ఈ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 156 స్థానాలు గెలుచుకోనున్నట్లు ఫలితాలను చూస్తే తెలుస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ 150 స్థానాలకు మించి గెలవడం ఇదే తొలిసారి. 1985లో కాంగ్రెస్ పార్టీ 149 స్థానాలతో ఉన్న రికార్డును బీజేపీ తాజాగా అధిగమించింది.

  • 08 Dec 2022 04:30 PM (IST)

    కాంగ్రెస్ గుజరాత్ ఇన్‌చార్జి హోదాకు రఘు శర్మ రాజీనామా

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి హోదాకు రఘు శర్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా లేఖ పంపారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఓడిపోనందుకు నేను పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నాను. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి హోదాకు రాజీనామా చేస్తున్నాను. దయచేసి నా రాజీనామాను అంగీకరించండి’’ అని ఆయన పేర్కొన్నారు.

  • 08 Dec 2022 04:12 PM (IST)

    గుజరాత్‌లో బీజేపీ... హిమాచల్‌లో కాంగ్రెస్ గెలుపు..

    గుజరాత్‌లో ఏడో సారి కాషాయ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఈ సారి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. గుజరాత్ లో మొత్తం సీట్లు 182. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 92. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఇప్పటివరకు 144 స్థానాల్లో గెలుపొందింది. ఇక హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 68. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 35. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు 37 స్థానాల్లో గెలుపొందింది.

  • 08 Dec 2022 03:41 PM (IST)

    హిమాచల్‌లో 36 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు

    హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఇప్పటివరకు 36 స్థానాల్లో గెలుపొందింది. మరో నాలుగు స్థానాల్లో ఆ పార్టీ ముందంజలో ఉంది. ఆ రాష్ట్రంలో బీజేపీ ఇప్పటివరకు 23 స్థానాల్లో గెలుపొంది, మరో రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇతరులు మూడు సీట్లు గెలుచుకున్నారు.

  • 08 Dec 2022 03:29 PM (IST)

    133 స్థానాల్లో బీజేపీ గెలుపు.. 24 స్థానాల్లో ఆధిక్యం

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఇప్పటివరకు 133 స్థానాల్లో గెలుపొందింది. 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో గెలుపొంది, ఏడు స్థానాల్లో ఆధిక్యత కొనసాగిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. మరో స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు.

  • 08 Dec 2022 02:11 PM (IST)

    డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం

    డిసెంబర్ 12న మధ్యాహ్నం 2 గంటలకు గుజరాత్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా హాజరవుతారని గుజరాత్ బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు.

  • 08 Dec 2022 01:50 PM (IST)

    రివాబా జడేజా విజయం ..

    టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా జడేజా విజయం సాధించారు. గుజరాత్‌లో జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో నిలిచారు. సమీప ప్రత్యర్థిపై సుమారు 60వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది అందరి విజయంగా అభివర్ణించారు.

     

    Rivaba Jadeja

    Rivaba Jadeja

  • 08 Dec 2022 01:43 PM (IST)

    ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటివరకు బీజేపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది. 25 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ 38 స్థానాల్లో, స్వతంత్రులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది.

  • 08 Dec 2022 01:05 PM (IST)

    ఆప్ బీజేపీకి ‘బి’ టీమ్‌గా పనిచేసింది

    కాంగ్రెస్ ఓట్లను చీల్చడం ద్వారా ఆప్ బీజేపీ 'బి' టీమ్‌గా పని చేసిందని కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయా ఆరోపించారు. దీంతో బీజేపీ 150 సీట్లు దాటింది. ఆశ్చర్యకరంగా గుజరాత్‌లో తొలిసారిగా దూకుడుగా పోటీ చేసిన ఆప్‌కి ఇప్పటి వరకు 12 శాతం ఓట్లు రాగా, ఆరు స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Dec 2022 12:58 PM (IST)

    ఈనెల 11న గుజరాత్ సీఎం ప్రమాణ స్వీకారం ..?

    గుజరాత్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూలేని విధంగా అత్యధిక స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.  మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం కావడంతో .. ఏడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. ఈనెల 10, 11 తేదీల్లో గుజరాత్ సీఎంగా మరోసారి భూపేంద్ర పటేల్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు అమిత్ షా, ఇతర బీజేపీ పెద్దలు రానున్నట్లు సమాచారం.

  • 08 Dec 2022 12:33 PM (IST)

    హిమాచల్ ప్రదేశ్‌లో 1985 నుంచి అదే ఆనవాయితీ ..

    హిమాచల్ ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపులో భాగంగా తొలి ట్రెండ్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అయితే ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాలను బట్టిచూస్తే ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిఫిగర్ 35 కంటే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం 38 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరో రెండు గంటల్లో పూర్తిస్థాయి ఫలితాలు వెల్లడికానున్నాయి. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్‌లు హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసేది మేమేఅంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 1985 నుండి, ఏ పార్టీ వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ఈ కొండ ప్రాంతంలో బీజేపీ మళ్లీ అధికారంలో కొనసాగితే అదో రికార్డు.

  • 08 Dec 2022 12:19 PM (IST)

    18వేల ఓట్ల ఆధిక్యంలో రవీంద్ర జడేజా సతీమణి

    గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్ నగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన క్రికెటర్ రవీంద్ర జడేజా సతీమణి రివాబా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలుత ఆమె వెనుకబడినప్పటికీ.. ప్రస్తుతం ఆమె పుంజుకున్నారు. తన సమీప ప్ర్యర్థిపై 18వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమె విజయంపై దీమాను వ్యక్తం చేశారు.

     

    Ravindra Jadeja's wife

    Ravindra Jadeja's wife

  • 08 Dec 2022 11:54 AM (IST)

    హిమాచల్ ప్రదేశ్‌లో పుంజుకున్న కాంగ్రెస్ ..

    హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అధికారం దిశగా ఆ పార్టీ ఒక్కో అడుగు వేస్తోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నా కొద్దీ ఆ రాష్ట్రంలో ఫలితాలు తారుమారవుతున్నాయి. అయితే, 11గంటల తరువాత కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ కు కావాల్సిన 35 స్థానాలను దాటింది. ప్రస్తుతం ఎన్నికల సంఘం డేటా ప్రకారం.. ఆ పార్టీ అభ్యర్థులు 38 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి ఒకరు విజయం సాధించగా, మరో 26 మంది అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

     

    Himachal pradesh election 20221

    Himachal pradesh election 20221

     

  • 08 Dec 2022 11:47 AM (IST)

    బ్రిడ్జి కూలిన నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం

    గుజరాత్ రాష్ట్రంలోని మోర్బీ పట్టణంలో వంతెన కూలి 140 మంది మరణించిన విషయం విధితమే. ఎన్నికల సమయంకంటే కొద్దిరోజుల ముందే ఈ ఘటన జరిగింది.  ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఓటమి ఖాయమని అందరూ భావించారు. కానీ ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో.. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కాంతిభాయ్ అమృతయ్య తన ప్రత్యర్థి కంటే ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Dec 2022 11:39 AM (IST)

    హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. 68 అసెంబ్లీ స్థానాల్లో 36 స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. బీజేపీ అభ్యర్థులు 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.  ఫలితాల ట్రెండింగ్ ఇలానే కొనసాగితే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

    Himachal pradesh election 2022

    Himachal pradesh election 2022

  • 08 Dec 2022 11:35 AM (IST)

    గుజరాత్‌లో బీజేపీ – 150, కాంగ్రెస్ – 19, ఆప్ – 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.

    Gujarat

    Gujarat

  • 08 Dec 2022 11:28 AM (IST)

    హిమాచల్ ప్రదేశ్‌లో బోణీ కొట్టిన బీజేపీ ..

    హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీగా పోరుసాగుతుంది. ఈ క్రమంలో బీజేపీ తొలి బోణీ కొట్టింది. సెరాజ్ నియోజకవర్గం నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్, సుందేర్ నగర్ స్థానం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి రాకేశ్ కుమార్ విజయం సాధించారు.

  • 08 Dec 2022 11:20 AM (IST)

    11గంటలకు ఎన్నికల సంఘం వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని మొత్తం 182 స్థానాల్లో పార్టీల ఆధిక్యం..

    బీజేపీ- 149
    కాంగ్రెస్ - 19
    ఆప్ - 9
    ఇతరులు - 4
    SP- 1

  • 08 Dec 2022 11:13 AM (IST)

    గుజరాత్‌లోని ఖంభాలియా నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదన్ గధ్వీ 18,998 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా సూరత్ కటర్ గామ్ నియోజకవర్గం నుంచి ఆప్ రాష్ట్ర ఛీప్ గోపాల్ ఇటాలియా వెనుకంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి వినోద్ మోరాదియా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 08 Dec 2022 10:54 AM (IST)

    గుజరాత్‌లో ఇప్పటివరకు పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం

    బీజేపీ - 53.61 శాతం

    కాంగ్రెస్ - 26.54 శాతం

    ఆప్ - 12.89 శాతం

    AIMIM - 0.40 శాతం

  • 08 Dec 2022 10:52 AM (IST)

    హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో పార్టీల ఓట్ల శాతం ..

    బీజేపీ - 43.60 శాతం

    కాంగ్రెస్ - 42.84 శాతం

  • 08 Dec 2022 10:49 AM (IST)

    కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏమన్నారంటే..

    గుజరాత్ లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నా కొద్ది బీజేపీ ఆధిక్యం పెరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థులు 151 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ ఫలితాల ట్రెండ్ పై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. గుజరాత్ లో ఫలితాలపై మేము ఆశ్చర్యంగా లేమని అన్నారు. ముందే ఈ ఫలితాలను ఊహించామని, ప్రధాని మోదీపై గుజరాత్ ప్రజల్లో చాలా నమ్మకం ఉందని, అందుకే ఈ ఫలితాలు అని అన్నారు.

  • 08 Dec 2022 10:34 AM (IST)

    గుజరాత్‌ ఎన్నికల కౌంటింగ్‌లో ఉదయం 10 గంటల వరకు నమోదైన ఓటు షేర్‌ను పార్టీల వారీగా ఎన్నికల సంఘం విడుదల చేసింది. బీజేపీ - 52.8 శాతం, కాంగ్రెస్ - 26.8 శాతం, ఆప్ - 14 శాతం చొప్పున ఓటు షేర్ సాధించాయి.

  • 08 Dec 2022 10:27 AM (IST)

    హిమాచల్ ప్రదేశ్.. మళ్లీ ఆధిక్యంలోకి కాంగ్రెస్..

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నా కొద్దీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బీజేపీ ఆధిక్యం తగ్గింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, బీజేపీ అభ్యర్థులు 31 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. ఇతరులు నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఫలితాల ట్రెండ్ ఇలానే కొనసాగితే.. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటులో స్వతంత్ర్య అభ్యర్ధులదే కీలక పాత్ర కానుంది.

  • 08 Dec 2022 10:22 AM (IST)

    14వేల ఓట్ల ఆధిక్యంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం

    హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తన నియోజకవర్గం సెరాజ్‌లో ప్రస్తుతం 14, 921 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Dec 2022 10:20 AM (IST)

    23వేల ఓట్ల ఆధిక్యంలో గుజరాత్ సీఎం

    గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన నియోజకవర్గం ఘట్లోడియాలో 23,713 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 08 Dec 2022 10:17 AM (IST)

    గుజరాత్‌‌లో బీజేపీ కార్యాలయం వద్ద పండుగ వాతావరణం ..

    గుజరాత్‌లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఫలితాలు వెలువడుతున్నా కొద్దీ ఆ పార్టీ అభ్యర్థుల ఆధిక్యం పెరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ 150 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా, కాంగ్రెస్ 21 స్థానాల్లో, ఆప్ 8 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది. ఈ క్రమంలో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైనట్లేనని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని బీజేపీ కార్యాలయం వద్దకు ఆ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంబరాలు చేసుకుంటున్నారు.

     

  • 08 Dec 2022 10:03 AM (IST)

    హిమాచల్ ప్రదేశ్‌లో అప్రమత్తమవుతున్న కాంగ్రెస్..

    హిమాచల్ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నా కొద్దీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరునడుస్తోంది. నువ్వానేనా అన్నట్లు ఆ పార్టీల అభ్యర్థుల మధ్య ఆధిక్యాలు తారుమారవుతున్నాయి. ప్రస్తుతం ఫలితాల ట్రెండ్ చూస్తుంటే ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వచ్చేలా కనిపించడం లేదు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ భారినపడకుండా.. కాంగ్రెస్ నుంచి విజయం సాధించిన అభ్యర్థులను రాజస్థాన్ కు తరలించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

  • 08 Dec 2022 09:51 AM (IST)

    రెండు చోట్ల బీజేపీదే హవా..

    గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నా కొద్దీ.. బీజేపీ ఆధిక్యం పెరుగుతోంది. గుజరాత్ లో బీజేపీ 112 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం 21 స్థానాలకు పడిపోయింది. ఇక ఆప్ ప్రస్తుతం పుంజుకుంది. తొమ్మిది స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందజలో ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థులు 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 08 Dec 2022 09:38 AM (IST)

    విరంగామ్‌ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన హార్థిక్‌ పటేల్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, సమీప ప్రత్యర్థి అయిన, లక్ష్‌భాయ్‌ భర్వాడ్‌ వెనుకంజలో ఉన్నారు.

  • 08 Dec 2022 09:36 AM (IST)

    గుజరాత్‌లో టీమిండియా క్రికెటర్ జడేజా భార్య రివాబా జడేజా జామ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి నిలిచారు. ప్రస్తుతం వెలువడుతున్న ఫలితాల్లో ఆమె ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు దక్షిణ గాంధీనగర్ నుంచి బీజేపీ అభ్యర్థి అల్పేష్ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు.

  • 08 Dec 2022 09:18 AM (IST)

    హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతాకూడా తెరవలేదు. ప్రస్తుతం లెక్కింపు పూర్తయిన ఓట్లలో.. ఇప్పటి వరకు ఆప్‌కు ఓట్ల శాతం 1 శాతం లోపే ఉంది. బీజేపీ ఓట్ల శాతం 50 శాతం కాగా, కాంగ్రెస్‌ ఓట్లు 40 శాతం.

  • 08 Dec 2022 09:07 AM (IST)

    గుజరాత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం నాలుగు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. అయితే ఓట్లు 19 శాతానికి పైగా వచ్చాయి. అదే సమయంలో బీజేపీకి 52 శాతం, కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు వచ్చాయి.

  • 08 Dec 2022 08:51 AM (IST)

    హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని ఆరంభ ట్రెండింగ్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇక్కడ మొత్తం 68 స్థానాలు ఉండగా 8:50గంటల సమయానికి బీజేపీ 33, కాంగ్రెస్ అభ్యర్థులు 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ఆప్ ఖాతా తెరవలేదు.

  • 08 Dec 2022 08:35 AM (IST)

    గుజరాత్‌లో బీజేపీ తన హవాను ప్రారంభించింది. 100 అసెంబ్లీ స్థానాల్లో ఆపార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ 22 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి

  • 08 Dec 2022 08:28 AM (IST)

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక్కడ ప్రారంభంలోనే కాంగ్రెస్ ఆధిక్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 26 మంది ఆధిక్యంలో కొనసాగుతుండగా, 19మంది బీజేపీ అభ్యర్థులు, ఇతరులు ముగ్గురు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 08 Dec 2022 08:26 AM (IST)

    గుజరాత్‌లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. బీజేపీకి చెందిన 36 మంది అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి 7గురు, ఆప్ నుంచి ఇద్దరు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.