Coconut Varieties : అధిక దిగుబడినిచ్చే కొబ్బరి రకాలు

ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఇతర ప్రాంతాల్లోనూ వీటిని సులభంగా సాగు చేసుకోవచ్చు. వేసవిలో రోజూ కనీసం 50 నుంచి 60 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది.

10TV Telugu News

Coconut Varieties : కొబ్బరి చెట్టును కల్పవృక్షంగా చెప్పవచ్చు.. మానవ జీవనంలో ఈ చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. కొబ్బరి ఈనె నుంచి కొబ్బరి నూనె వరకు.. కొబ్బరి కాయ నుంచి కొబ్బరి బెరడు వరకు.. ప్రతి ఒక్కటీ మనిషికి ఉపయోగపడటంతోపాటు రైతులకు మంచి అదాయాన్ని తెచ్చిపెడుతుంది. అందుకోసమే కొబ్బరి చెట్లను పెంచుకునేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఒకప్పుడు వ్యవసాయ బావుల వద్ద, పొలం గట్లపైన ఒకటో రెండో చెట్లను మాత్రమే పెంచుకొనేవారు..అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో రైతులు పెద్ద ఎత్తున కొబ్బరి సాగువైపు ఆసక్తి చూపిస్తున్నారు.

గాలిలో తేమ ఎక్కువగా ఉండే కోస్తా ప్రాంతాలు, వర్షపాతం అధికముగాను, సక్రమంగా ఉండే ప్రాంతాలు అనువుగా ఉంటాయి. సాలీనా వర్షపాతం 1000-2000 మి.మీ. వరకు ఉండాలి. నీటి సదుపాయం, మురుగు వసతి గల సారవంతమైన డెల్టా భూములు ఈ పంటకు చాలా అనుకూలము. నీటి సదుపాయము గల గరప, ఎర్రనేలలు కూడా సాగుకు అనుకూలము. కోస్తా ప్రాంతానికి దూరంగా ఉండు లోతట్టు ప్రాంతాలు కొబ్బరి పెంపకమునకు అనుకూలం కాదు. సగటు ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గినట్లయితే, కొబ్బరి మొక్క పెరుగుదల బాగా తగ్గిపోతుంది.

ప్రత్యేక యాజమాన్య పద్ధతులు పాటించడం వల్ల ఇతర ప్రాంతాల్లోనూ వీటిని సులభంగా సాగు చేసుకోవచ్చు. వేసవిలో రోజూ కనీసం 50 నుంచి 60 లీటర్ల నీరు అందించాల్సి ఉంటుంది. సేంద్రియ విధానం ద్వారా నేలలో ఎక్కువ కాలం తేమ ఉండేలా చేయవచ్చు. రాలిపోయే కొబ్బరి ఆకుల్ని, అంతర పంటల ఆకుల్ని కాల్చివేయకుండా అదే స్థలంలో ఉంచాలి. తద్వారా నేలలో తేమశాతం అధికంగా ఉంటుంది. ఈ చెట్లకు నీరు అందించేందుకు డ్రిప్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఫలితంగా నీటి వృథాను అరికట్టడంతోపాటు చెట్టుకు సరైన పద్ధతిలో నీరు అందించే అవకాశం ఉంటుంది. సౌడు నేలలు మినహా, అన్ని రకాల నేలలూ కొబ్బరి సాగుకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా పొట్టిరకం, సంకర జాతి చెట్లు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెరుగుతాయి.

కొబ్బరి సాగుకు అనువైన రకములు:

ఈస్ట్‌కోస్ట్‌ టాల్‌ దేశవాళీ రకం: ఈ రకము మన తూర్పు కోస్తా ప్రాంతములలో విస్తారముగా పెంచబడుతున్నది. ఇది సాధారణముగా 7 సంవత్సరములలో కాపునకు వచ్చి సగటున సాలుకు చెట్టు ఒక్కింటికి 75 నుండి 100కాయలు దిగుబడి వస్తుంది. కాయలో 146 గ్రా. ఎండు కొబ్బరి మరియు 64 శాతము నూనె ఉండును.

గౌతమి గంగ ; గంగా బొండం అనే ఈ రకము 2007 వ సంవత్సరంలో గౌతమి గంగా నామకరణం చేశారు. ఈపొట్టి రకము మన రాష్ట్రంలోని కోనసీమ ప్రాంతంలో కొబ్బిరి నీళ్ల కోసం పెంచుతారు. ఈ రకం నాలుగు సంవత్సరాలకే కాపుకు వన్తుంది. కాయలు మధ్యస్థ సైజులో బొప్పాయి కాయ ఆకారంలో ఉంటాయి. గెలలు ఆకులు ఆకువచ్చగా ఉంటాయి. సగటున సాలుకు 60 కాయలు వరకు దిగుబడి ఉంటుంది. దానిలో ఎండు. కొబ్చరి 148 గ్రా. 68 శాతం నూనె లభిస్తుంది.

గోదావరి గంగ హైబ్రిడ్ రకం‌: మన రాష్ట్రంలో ఈస్ట్‌ కోస్ట్‌ టాల్‌ దేశవాళీ ను తల్లి చెట్టుగాను, గంగా బొండంనుమగ చెట్టుగాను ఉపయోగించి హైబ్రిడ్‌ రకాన్ని అంబాజీపేట కొబ్బరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు 1991సంవత్సరంలో రూపొందించారు. ఈ హైబ్రిడ్‌ ‘గోదావరి గంగ’ అను పేరుతో మన రాష్ట్రంలో సాగుకు విడుదల చేయబడినది. జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలలో సాగుకు సిఫార్సు చేయబడినది. ఈ రకం నాలుగు సంవత్సరములలో కాపునకు వచ్చి 6-7 సంవత్సరాలలో మంచి దిగుబడినిచ్చుట ప్రారంభిస్తుంది. సాలుకు సగటున చెట్టు ఒక్కింటికి 140 కాయలు దిగుబడినిస్తుంది. కాయకు 68 శాతం నూనె కలిగిన 150గ్రా. కొబ్బరి ఉంటుంది.

డబుల్‌ సెంచరీ: ఈ రకము దేశవాళీ కంటె ఎక్కువ దిగుబడినిచ్చు, తూర్పు తీర ప్రాంతంలో సాగుకు అనువైనదిగా తేల్చబడినది. ఈ రకము 1994 నంవత్సరములో విడుదల చేయబడినది. నుమారు 7సంవత్సరములకు కాపుకొచ్చి సగటున సాలీన 130 కాయలు దిగుబడినిస్తుంది. ఈ రకం కాయలు 160 గ్రా.ఎండు కొబ్బరి మరియు 64 శాతం నూనె కలిగి ఉందును.

అఖిల భారతీయ వన్య తోట వంటల పరిశోధనా పధకము 23వ వార్షిక సదస్సులో గంగాబొండం ఫిలిప్పైన్స్‌ ఆర్దినరీ టాల్‌ (వశిష్ట గంగ) అనే హైబ్రిడ్‌ రకాన్ని జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌, కర్దాటక రాష్ట్రాలో సాగుకు సిఫార్సు చేయబడినది. ఈ రకం 52 నెలల్లో కాపుకు వస్తుంది. సాలుకు సగటున చెట్టు ఒక్కింటికి 125 కాయలు దిగుబడినిస్తుంది. చెట్టుకు ఎండు కొబ్బరి 21.9 కేజీలు, 69 శాతం నూనె లభిస్తుంది.

ఇతర పంటల మాదిరిగా కాకుండా కొబ్బరి సాగు దీర్ఘకాలిక పంట. మొక్క నాటిన నాటి నుంచి కనీసం 50 నుంచి 70 ఏండ్ల పాటు దిగుబడి వస్తూనే ఉంటుంది. మరో నాలుగైదేండ్లలో దిగుబడి తగ్గుతుందన్న దశలో.. అదే ప్రాంతంలో కొత్త పంట సాగుకు చర్యలు తీసుకోవాలి. పాత చెట్లకు మూడు నాలుగు మీటర్ల దూరంలో కొత్త మొక్కల్ని నాటుకోవాలి. దీంతో పాత మొక్క దిగుబడి ఆగిపోయే నాటికి కొత్త మొక్క దిగుబడి ప్రారంభం అవుతుంది. దీంతో రైతుకు నిరంతర ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది.