సరిహద్దుల్లో మళ్లీ జవాన్ల ఫైటింగ్…వైరల్ వీడియోపై స్పందించిన భారత ఆర్మీ

  • Published By: venkaiahnaidu ,Published On : May 31, 2020 / 12:20 PM IST
సరిహద్దుల్లో మళ్లీ జవాన్ల ఫైటింగ్…వైరల్ వీడియోపై స్పందించిన భారత ఆర్మీ

లఢఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొంది. యుద్ధానికి సన్నద్ధం కావాలంటూ ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ తన దేశ సైనికులకు పిలుపునిచ్చారు. దీంతో లడక్ సమీపంలో సరిహద్దులకు అవతల చైనా ఆర్మీ పెద్ద ఎత్తున సైన్యాన్ని మోహరింపజేసింది. యుద్ధ సామాగ్రిని తరలించింది. మరోవైపు భారత్ కూడా సరిహద్దు దగ్గర భారీగానే సైన్యాన్ని మొహరించింది. ఇటీవల ఆర్మీచీఫ్ కూడా లఢఖ్,లేహ్ లో పర్యటించారు.

ఇలాంటి సమయంలో లఢఖ్ లోని పాంగాంగ్ సరస్సు దగ్గర ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాంగాంగ్ లేక్ దగ్గర భారత సైనికులపై చైనా సైనికులు రాళ్ల దాడికి పాల్పడటంతో… భారత సైనికులు చైనా జవాన్‌ లను అడ్డుకుని.. బంధించినట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇండో -టిబెట్ సరిహద్దు పోలీసులు చైనా సైనికుడిని బంధించారని, అతణ్ని చితగ్గొట్టి,వాళ్ల ఆర్మీ వాహనాన్ని ధ్వంసంచేసినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తోంది.

లఢఖ్ సమీపంలో భారత్, చైనా సరిహద్దుల వద్ద ఫింగర్-4, ఫింగర్-5 ప్రాంతం వద్ద భారత భూభాగంపైకి చొచ్చుకుని వచ్చిన చైనా జవాన్లు, ఓ యుద్ధ ట్యాంకును ఐటీబీపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. యుద్ధ ట్యాంకును భారత జవాన్లు ధ్వంసం చేయడం, చైనా సైనికుడిని బంధించడం,  కొద్దిసేపటి తరువాత ఆ సైనికుడిని మనదేశ జవాన్లు విడిచి పెట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియో ఎక్కడిదనేది, ఎప్పటిదనేది కూడా తెలియరావట్లేదు.

అయితే,సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై భారత ఆర్మీ స్పందించింది. సరిహద్దుల్లో జరిగిన ఒక సంఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలోని విషయాలు ప్రామాణీకరించబడలేదని మరియు ఉత్తర సరిహద్దుల్లోని పరిస్థితులతో దానిని అనుసంధానించే ప్రయత్నాలు ఉద్దేశ్యపూర్వకంగా చిత్రీకరించిన అబద్దాలు అని ఆర్మీ తెలిపింది. ప్రస్తుతం బోర్డర్ లో ఎటువంటి హింస జరగడం లేదని భారత ఆర్మీ తెలిపింది. ఇరు దేశాల మధ్య వివాదాలు సైనిక కమాండర్ల మధ్య పరస్పర చర్యల ద్వారా పరిష్కరించబడతాయని, రెండు దేశాల మధ్య సరిహద్దుల నిర్వహణపై ఏర్పాటు చేసిన ప్రోటోకాల్‌లచే మార్గనిర్దేశం చేయబడతాయని తెలిపింది.