విధ్వంసం నిజమేనా : పాక్ పై దాడి శాటిలైట్ ఫొటోలు విడుదల

విధ్వంసం నిజమేనా : పాక్ పై దాడి శాటిలైట్ ఫొటోలు విడుదల

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పాక్ లోని బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. అయితే వాయుసేన మెరుపుదాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు చనిపోయారో చెప్పాలంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సమయంలో..జైషే ఉగ్రశిబిరంపై వాయుసేన దాడులకు సంబంధించిన తొలి శాటిలైట్ ఊహాచిత్రాలతో ప్రింట్ వార్తాసంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. వాయుసేన దాడుల్లో జైషే క్యాంపులు దెబ్బతిన్నమాట వాస్తవమే గానీ భారీ విధ్వంసం జరిగిన దాఖలాలు లేవని ఆ కథనంలో తెలిపింది.

ఈ ఛాయాచిత్రాల ఆధారంగా.. చూట్టూ చెట్ల మధ్యలో కొండపై ఉన్న జైషే క్యాంపు పై భాగంలో నాలుగు డార్క్ స్పాట్లు ఉన్నాయి. భూమిపై కాలిన గుర్తులు ఉన్నాయి. కొన్ని భవనాలు, గోడలు మాత్రం చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయని తెలిపింది. పుల్వామా ఘటనతో భారత్ ప్రతీకారదాడికి పాల్పడుతుందని పాక్ సైన్యం ముందే ఊహించినట్లు చెప్పుకొచ్చారు. దాడికి ముందే బాలాకోట్ లోని జైషే మదర్సా దగ్గర మొహరించినట్లు సమాచారం. ఆ మదర్సాలో చదువుకుంటున్న విద్యార్థి బంధువు ఒకరు ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు. దాడి మొదలవగానే విద్యార్థులను వేర్వేరు చోట్లకు తరలించినట్లు ఆ వ్యక్తి తెలిపారు. వాయుసేన దాడిలో పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐకు చెందిన కర్నల్ సలీమ్ ఖరీ, ఉగ్రవాద శిక్షకుడు మౌలానా మొయూన్ మృతి చెందినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.