గాలి ద్వారా ఆ ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి… WHO కొత్త గైడ్ లైన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : July 10, 2020 / 04:06 PM IST
గాలి ద్వారా ఆ ప్రాంతాల్లోనే కరోనా వ్యాప్తి… WHO కొత్త గైడ్ లైన్స్

గాలి ద్వారా కూడా కరోనా వైరస్ సోకే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) స్పష్టం చేసింది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ సంక్రమణకు అవకాశం ఉందని వెల్లడించింది. గాలి ద్వారానూ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని 32 దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తల బృందం ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాయగా.. వారి వాదనను డబ్ల్యూహెచ్ఓ పరిగణనలోకి తీసుకున్న విషయం తెలిసిందే.

వైర‌స్ కొన్ని ప్రాంతాల్లో గాలిలో వ్యాపించే ఆస్కారం ఉందని, అయితే, దీనిపై విస్తృత పరిశోధనలు అవసరమని పేర్కొన్న డబ్ల్యూహెచ్ఓ.. తాజాగా సవరించిన మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. కొన్ని ప‌రిస్థితుల్లో మాత్రమే గాలి ద్వారా కరోనా వ్యాప్తి సాధ్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది. ముఖ్యంగా రెస్టారెంట్లు, బృంద‌గానం చేసే ప్ర‌దేశాలు, జిమ్ములు నిర్వ‌హించే ప్ర‌దేశాల్లో మాత్ర‌మే వైర‌స్ గాలిలో వ్యాపించే అవ‌కాశాలను అధ్య‌య‌నాలు సూచిస్తున్నాయ‌ని తెలిపింది.

WHO కొత్త మార్గదర్శకాలు

ప్రజలు సమూహాలను నివారించాలి మరియు భవనాలలో మంచి వెంటిలేషన్ ఉండేలా చూడాలి. సామాజిక దూరం పాటించాలి . శారీరక దూరం సాధ్యం కానప్పుడు మాస్క్ లను ప్రోత్సహించాలి. కరోనావైరస్..  కలుషితమైన ఉపరితలాలతో లేదా సోకిన వ్యక్తులతో సన్నిహిత పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తులతో దగ్గరి పరిచయం ద్వారా లాలాజలం, శ్వాసకోశ స్రావాలు లేదా బిందువుల ద్వారా సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ము, మాట్లాడేటప్పుడు లేదా పాడినప్పుడు విడుదలవుతుంది.

 

ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఇండోర్ ప్ర‌దేశాలు, ఎక్కువ వెంటిలేష‌న్ లేని ప్రాంతాల్లో వైర‌స్ బారినపడ్డ వారి నుంచి ఇది మ‌రింత మందికి వ్యాపించే అవ‌కాశాన్ని కొట్టిపారేయ‌లేమ‌ని WHO తెలిపింది. వీటితోపాటు వైర‌స్ సోకిన వ్య‌క్తులు తిరిగిన ప్రాంతాలు లేదా బహిరంగ ప్ర‌దేశాల్లో ప్ర‌జ‌లు స‌న్నిహితంగా మెల‌గ‌డం వ‌ల్ల‌ వైర‌స్ వ్యాప్తిచెందే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని పేర్కొంది.

ఎలాంటి రోగ లక్షణాలు లేని (ఎసింప్ట‌మేటిక్) వ్యక్తుల వల్ల కరోనా వైర‌స్‌ వేగంగా వ్యాప్తి చెందుతుందనే శాస్త్రవేత్తల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై కూడా WHO వివరణ ఇచ్చింది. వైర‌స్‌ని వ్యాప్తి చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఎసింప్ట‌మేటిక్ వ్య‌క్తులలో ఉన్న‌ప్ప‌టికీ, ఇది చాలా అరుదుగా జరుగుతుందని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది.

ప్ర‌స్తుతం అనుమానిత ల‌క్ష‌ణాలు లేనివారి నుంచి వైర‌స్ వ్యాప్తి స‌మాజంలో ఏస్థాయిలో ఉందో నిజంగా ఇప్ప‌టివ‌రకు సరైన అంచనా లేదని డ‌బ్ల్యూహెచ్ఓ అభిప్రాయ‌ప‌డింది. ఎక్కువశాతం వైర‌స్ సోకిన వ్య‌క్తులు మాట్లాడినప్పుడు, ద‌గ్గినప్పుడు, తుమ్మిన‌ప్పుడు నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారానే వైర‌స్ వ్యాప్తి చెందుతున్న‌ట్లు WHO పునరుద్ఘాటించింది.