మోడీ గవర్నమెంట్‌పై ప్రియాంక గాంధీ సెటైర్లు

మోడీ గవర్నమెంట్‌పై ప్రియాంక గాంధీ సెటైర్లు

కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ.. నరేంద్ర మోడీ ప్రభుత్వంపై సెటైర్లు విసిరారు. దేశంలో ఆర్థిక సంక్షోభం స్పష్టంగా కనిపిస్తుంటే బీజేపీ మంత్రులు దానిని వక్రీకరిస్తున్నారన్నారు. ఇటీవలే నిర్మలా సీతారామన్, పీయూశ్ గోయెల్ జీడీపీ పడిపోవడంపై స్పందించిన తీరుకు ట్విట్టర్ వేదికగా ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు.

క్రికెట్‌తో పోల్చి చెప్తూ.. ‘ఒక క్యాచ్ అందుకోవడం కోసమే, మైదానంలో క్రికెటర్లు చివరి క్షణం వరకూ బంతిని చూస్తూనే ఉంటారు. అది క్రీడా స్ఫూర్తి అంటే. అలా ఆలోచించాలి కానీ, గురుత్వాకర్షణ, గణితం, ఓలా, యూబర్ అంటూ సంబంధం లేని వాటిపై రుద్దకూడదు’ అని ట్వీట్ చేశారు. అయితే ట్వీట్ చివరి వరకూ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించని ప్రియాంక.. చివర్లో భారతీయ ఆర్థిక వ్యవస్థ కోసం జనహితార్థం జారీ చేయబడింది’ అని రాశారు. 

కేంద్ర పరిశ్రమల, వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూశ్ గోయెల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆర్థికమందగమనం గురించి ఓ విలేకరి ప్రశ్నకు ‘లెక్కల గురించి మర్చిపోండి. లెక్కల వల్ల ఐన్‌స్టీన్ భూమి గురుత్వాకర్షణ శక్తిని గుర్తించలేదు’ అని అన్నారు. ఆ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఐన్‌స్టీన్ గురుత్వాకర్షణ గురించి కనిపెడితే మరి న్యూటన్ ఎవరని ప్రశ్నిస్తున్నారు.