హస్తం హవానేనా? : నేడే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు

  • Published By: vamsi ,Published On : December 23, 2019 / 02:21 AM IST
హస్తం హవానేనా? : నేడే జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు(23 డిసెంబర్ 2019) వెలువడనున్నాయి. ఉదయం 8గంటకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ ప్రక్రియ శుక్రవారం(20 డిసెంబర్ 2019) ముగియగా మొత్తం 81 స్థానాలకు ఐదు విడతల్లో ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వివిధ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో అధికార బీజేపీకి మళ్లీ అధికారం కష్టమే అని అంచనా వేశాయి. జార్ఖండ్ ఏర్పడిన తర్వాత తొలిసారి ఐదేళ్లు పూర్తికాలం అధికారంలో ఉన్న బీజేపీని ప్రస్తుతం ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరించారని వెల్లడించాయి.

కాంగ్రెస్, జేఎంఎం, ఆర్​జేడీ కూటమికే విజయావకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టం చేశాయి. టైమ్స్ నౌ అంచనా ప్రకారం.. కాంగ్రెస్ కూటమి 38 నుంచి 50 స్థానాలు, బీజేపీ 22 నుంచి 32 చోట్ల విజయం సాధిస్తుందని, జార్ఖంగ్ వికాస్ మోర్చా మూడు, ఇతరులు ఆరు చోట్ల విజయం సాధించే అవకాశ ఉందని తెలిపాయి. ఇండియా టుడే- యాక్సిస్ అంచనాలు కూడా దీనికి దగ్గరగా ఉన్నాయి. కాంగ్రెస్-జేఎంఎం కూటమి 43, బీజేపీ 27, జేవీఎం 3, ఏజేఎస్‌యూ 5, ఇతరులు మూడు చోట్ల గెలుస్తారని ఆ సర్వే వెల్లడించింది.

సీ ఓటర్ సర్వే ప్రకారం కాంగ్రెస్ కూటమి 31 నుంచి 39, బీజేపీ 28 నుంచి 36 చోట్ల గెలుపొందే అవకాశం ఉందని చెప్పాయి. ఐఏఎన్ఎస్ సీ ఓటర్-ఏబీపీ సర్వే మాత్రం కాంగ్రెస్ కూటమి, బీజేపీ మధ్య కేవలం మూడు సీట్ల వ్యత్యాసం మాత్రమే ఉంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ కూటమి 35, బీజేపీ 32, జేవీఎం 2, ఏజేఎస్‌యూ 5, ఇతరులు 7 చోట్ల విజయం సాధించే అవకాశం ఉందని ఆ సర్వేలో వెల్లడైంది. వాస్తవ ఫలితాల్లో ఇవే అంచనాలు నిజమైతే బీజేపీ నుంచి మరో రాష్ట్రం చేజారే అవకాశం ఉంది. 

అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఇక్కడ మొత్తం 14 పార్లమెంటు స్థానాల్లో 11 చోట్ల బీజేపీ విజయం సాధించింది. అయితే, ఏజేఎస్‌యూతో పొత్తు వికటించడంతో ఆరు నెలల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది. హంగ్ ఏర్పడే అవకాశం కూడా ఉంది.