హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం

హర్యానా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం

Khattar government హ‌ర్యానా సీఎం మ‌నోహ‌ర్‌లాల్ ఖ‌ట్ట‌ర్‌పై ఆ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు,మాజీ సీఎం భూపింద‌ర్ సింగ్ హుడా అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు. రైతుల విష‌యంలో బీజేపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రికి నిర‌స‌న‌గా తాము ముఖ్య‌మంత్రిపై అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టామ‌ని హుడా పేర్కొన్నారు. ప్ర‌స్తుతం హ‌ర్యానా అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ ప్ర‌వేశ‌పెట్టిన‌ అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రుగుతున్న‌ది. చ‌ర్చ అనంతరం తీర్మానంపై ఓటింగ్ నిర్వ‌హించ‌నున్నారు. కాగా, ఆ రాష్ట్ర‌ అసెంబ్లీలో మొత్తం 88 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో అధికార బీజేపీ స‌భ్యులు 40 మంది, దాని మిత్రపక్షమైన జేజేపీ స‌భ్యులు 10 మంది ఉన్నారు. ఇక‌ ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీకి 30 మంది స‌భ్యుల బ‌లం ఉండ‌గా, ఇతరులు 8 మంది ఉన్నారు. అవిశ్వాస తీర్మానం వీగిపోవాలంటే అధికార పక్షానికి 44 మంది సభ్యుల మద్దతు అవసరం.

కాంగ్రెస్ పార్టీ త‌మ‌కు ఇద్దరు స్వతంత్రుల మ‌ద్ద‌తు ఉన్న‌ద‌ని చెబుతున్న‌ది. వారితో కలుపుకుని ప్ర‌తిప‌క్షాల‌ బ‌లం 32కు పెరిగినా అధికార‌ప‌క్షానికి వ‌చ్చిన ఆప‌దేమీ లేన‌ట్లే క‌నిపిస్తున్న‌ది. ఎందుకంటే అధికార బీజేపీకి సొంతంగా 40 మంది స‌భ్యులు ఉండ‌గా 10 స్థానాలున్న జేజేపీ, ఆరుగురు స్వ‌తంత్రులు మ‌ద్ద‌తిస్తున్నారు. దీంతో అవిశ్వాస తీర్మానానికి వ్య‌తిరేకంగా 56 ఓట్లు ప‌డే అవకాశం ఉన్న‌ది. ఇటీవ‌ల రైతుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన కొంద‌రు జేజేపీ ఎమ్మెల్యేలు తీర్మానానికి వ్య‌తిరేకంగా ఓటేసినా ఖ‌ట్ట‌ర్ స‌ర్కారుకు వ‌చ్చే న‌ష్ట‌మేమీ క‌నిపించ‌డం లేదు.

కాగా,అసెంబ్లీలో అవిశ్వాస తీర్మాణంపై చర్చ సమయంలో సీఎం ఖట్టర్ మాట్లాడుతూ..నో కాన్ఫిడెన్స్(అవిశ్వాసం)కాంగ్రెస్ సాంప్రదాయం. ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినప్పుడు..ఈవీఎంలపై విశ్వాసం లేదు,సర్జికల్ స్ట్రైయిక్స్ కి ఫ్రూఫ్ లు అడుగుతారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే అంతా బాగుంటుంది. అదే బీజేపీ అధికారంలో ఉంటే వారికి ఏదీ బాగున్నట్లు అనిపించదు. కాంగ్రెస్ లోనే “అపనమ్మకాన్ని”చూడవచ్చు.ఇవాల పీసీ చాకో కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. కొన్నిసార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ సుర్జేవాలా లేదా హుడా సాహెబ్ మధ్య G-23(గతేడాది కాంగ్రెస్ లో సంస్కరణల కోసం హైకమాండ్ కు లేఖ రాసినోళ్లు) లేదా అపనమ్మకం ఉంటుందని సీఎం అన్నారు.