కరోనా సెకండ్ వేవ్‌కు కారణం నాయకత్వమే: రఘురామ్ రాజన్

కరోనా సెకండ్ వేవ్‌కు కారణం నాయకత్వమే: రఘురామ్ రాజన్

Raghuram Rajan: కరోనా మహమ్మారి తీవ్రంగా ఇబ్బందులు పెడుతోంది ప్రజలను.. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోనూ కరోనా సంక్షోభం కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. కేసులు, మరణాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న ఇటువంటి పరిస్థితికి కారణం నాయకత్వమే అంటున్నారు నిపుణులు. దేశంలో సరైన నాయకత్వం లేకనే ఈ పరిస్థితి అని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.

లేటెస్ట్‌గా మాజీ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ కోవిడ్ దేశంలో మళ్లీ ఎందుకు విజృంభిస్తుంది అనేదానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి గరిష్ట స్థాయికి చేరుకొని తిరిగి తగ్గుముఖం పట్టకపోవడానికి నాయకుల నిర్లక్ష్యమే కారణమని రాజన్ అన్నారు.

“సరైన నాయకత్వం లేకపోవడం, దూరదృష్టి కలిగి ఉండకపోవడం” వల్లనే దేశంలో కరోనా కరాళ నృత్యానికి కారణం అని అన్నారు రాజన్. నాయకులు జాగ్రత్తగా చర్యలు తీసుకుని, కరోనా తగ్గలేదని ప్రజలను హెచ్చరించి ఉంటే, పరిస్థితి చేయిదాటి పోయేది కాదని” అన్నారు బ్లూమ్‌బర్గ్ ఇంటర్వ్యూలో రాజన్.

బ్రెజిల్ వంటి దేశాల్లో వైరస్ మళ్లీ విస్తరించినా.. ముందే గ్రహించి కరోనా వైరస్‌పై పోరాటం చేసి ఆయా దేశాలు విజయవంతం అయ్యాయని అన్నారు. కానీ భారత్‌లో మాత్రం అధికారులు ప్రకటించిన తర్వాత కూడా కేసులు పెరిగాయని అన్నారు. దేశంలో కేసులు మళ్లీ పెరగాయని పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

కరోనా సంక్షోభం వల్ల కొన్ని పరిశ్రమలు, వైద్య నిపుణులు కొన్ని వారాలు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ చేయాలని పిలుపునివ్వగా.. ఇప్పుడు ఆ పరిస్థితే వచ్చిందని అన్నారు. ప్రస్తుతం అమెరికాలోని చికాగో యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు రాజన్.