లగ్జరీ హోటల్ నుంచి పనిచేయనున్న “లోక్ పాల్”

  • Published By: venkaiahnaidu ,Published On : April 23, 2019 / 02:14 AM IST
లగ్జరీ హోటల్ నుంచి పనిచేయనున్న “లోక్ పాల్”

ప్రజాస్వామ్య భారతంలో అవినీతి అరికట్టే సరికొత్త వ్యవస్థ లోక్‌పాల్‌.దేశపు మొట్టమొదటి లోక్ పాల్ ఆఫీస్…ఢిల్లీలోని చాణక్యపురిలోని ఫైవ్ స్టార్ లగ్జరీ హోటల్ “ది అశోక”నుంచి తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. తమ తాత్కాలిక కార్యాలయంగా అశోక హోటల్ ఉంటుందని సోమవారం(ఏప్రిల్-22,2019)అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. లోక్‌పాల్‌ ఛైర్‌పర్సన్‌ తో పాటు ఎనిమిది సభ్యులకు హోటల్ లో వేర్వేరు తాత్కాలిక కార్యాలయాలను ఏర్పాటు చేశారు.

తొలి లోక్‌పాల్‌ గా చైర్ పర్శన్ గా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ చేత మార్చి-23,2019న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. ఎనిమిది మంది లోక్ పాల్ సభ్యుల చేత మార్చి-27,2019న జస్టిస్ ఘోష్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ లోక్‌పాల్‌ లో జ్యుడిషియల్‌ సభ్యులుగా జస్టిస్‌ దిలీప్‌ బి భోసలే, జస్టిస్‌ ప్రదిప్‌ కుమార్‌ మొహంతి, జస్టిస్‌ అభిలాష కుమారి, జస్టిస్‌ అజయ్‌కుమార్‌ త్రిపాఠీ, నాన్‌ జ్యుడిషియల్‌ సభ్యులుగా…దినేష్‌కుమార్‌ జైన్‌, అర్చనా రామసుందరం, మహేందర్‌సింగ్‌, ఇంద్రజిత్‌ ప్రసాద్‌ గౌతం నియమితులయ్యారు. లోక్‌పాల్‌ చట్టాన్ని కోరుతూ అన్నాహజారే చేసిన పోరాటానికి ప్రతిఫలంగా 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. కేంద్రస్థాయిలో లోక్‌పాల్‌, రాష్ట్రస్థాయిలో లోకాయుక్తగా దీన్ని పిలుస్తారు.