20 మంది ఇన్ ఫార్మర్లను చంపేస్తాం, మావోయిస్టుల ప్రెస్ నోట్

  • Published By: madhu ,Published On : July 20, 2020 / 11:29 AM IST
20 మంది ఇన్ ఫార్మర్లను చంపేస్తాం, మావోయిస్టుల ప్రెస్ నోట్

ఛత్తీస్‌గఢ్‌ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. 20 మంది పోలీసులకు సహకరిస్తూ..ఇన్‌ఫార్మర్లుగా పని చేస్తున్నారని… త్వరలోనే వారిని చంపేస్తామంటూ మావోయిస్టులు ప్రెస్‌నోట్ జారీ చేశారు.

మలంగీర్‌ ఏరియా కమిటీ కార్యదర్శి సోమంగా పేరిటి ఈ ప్రెస్‌నోట్‌ విడుదలైంది. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. కొద్ది రోజుల క్రితం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఆ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరిగాయి.

ఇందులో మావోయిస్టులైన కుంజం గుడి, సోధి పోడియా, మాడవి లాచు, మాడవి ముయా చనిపోయారు. వీరి మృతికి కారణం పోలీస్‌ ఇన్‌ఫార్మర్లేనని మావోయిస్టులు నిర్ణయించారు. 20మంది ఇన్‌ఫార్మర్ల పేర్లతో జాబితాను విడుదల చేశారు.

గునియాపాల్, హీరోలి పెర్పా, మడక్మీరాస్‌, దంతేవాడలోని చోల్నార్‌ గ్రామానికి చెందిన 20మంది గ్రామస్తులను ఇన్‌ఫార్మర్లుగా పేర్కొన్నారు. ఈ 20మందిని చంపేయనున్నట్టు ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. 20మంది స్థానికులను చంపడానికి ముందు ప్రజా కోర్టు నిర్వహిస్తామన్నారు.

ప్రజాకోర్టులోనే వారిని శిక్షిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు మావోయిస్టుల హెచ్చరికలపై దంతెవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ స్పందించారు. మావోయిస్టులు గ్రామస్తులను లక్ష్యంగా చేసుకోవడం దుర్మార్గపు చర్యని అన్నారు.

మావోయిస్టులు తమ హెచ్చరికలతో గ్రామస్తుల్లో భయాందోళనలు సృష్టించారని తెలిపారు. దంతెవాడ సమీప గ్రామాల్లో భారీ బందోబస్తు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.