కరోనాపై భారత్‌ పోరులో కీలకంగా ముగ్గురు మహిళలు

  • Published By: vamsi ,Published On : April 19, 2020 / 03:35 AM IST
కరోనాపై భారత్‌ పోరులో కీలకంగా ముగ్గురు మహిళలు

చదువులో, వృత్తిలో ఎన్నో ఒడుదుడుకులు ఎదిరించి ముందుకు నడిచి విజయాలు సాధించిన మహిళా శాస్త్రవేత్తల జీవితాలు ఆచరనీయం, అనుసరనీయం. అవకాశం ఇవ్వాలే గాని తాము ఎవ్వరికీ తీసిపోమని, కృషిలోగానీ, మేధస్సులోగాని అగ్రగాములుగా నిలుస్తామని నిరూపిస్తూ ఉంటారు. వైజ్ఞానిక జగత్తులో అటువంటి ముగ్గురు వనితలు భారత్‌తో కరోనా పోరులో ముఖ్యభూమిక పోషించారు. వారి గురించి తెలుసుకుందాం.

అగ్రదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. భారత దేశంలో ఇప్పుడు తన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే భారత్‌లో ఈ వైరస్‌పై పోరాటంలో ముగ్గురు మహిళలు కీలకమైన పాత్ర పోషించారు. ఈ ముగ్గురు ఇప్పుడు భారత జాతికే కాకుండా ప్రపంచానికే ఆదర్శం అయ్యారు. వారే తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారతీయ శాస్త్రవేత్త మీనల్ దఖావే భోసలే, మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షెఫాలి దేశాయ్, మిథాలీ పాటిల్.

నిండు గర్భిణిగా ఉండి… దేశం కోసం.. మీనల్ దఖావే భోసలే:
తొలి మేడిన్ ఇండియా టెస్టింగ్ కిట్‌ను అందించిన భారతీయ శాస్త్రవేత్త మీనల్ దఖావే భోసలే. పుణెలోని ‘మైల్యాబ్ డిస్కవరీ’ అనే సంస్థ.. కోవిడ్-19 టెస్టింగ్ కిట్లను తయారు చేసి, అమ్మటానికి పూర్తి స్థాయి అనుమతి పొందిన తొలి భారతీయ సంస్థ. ఆ సంస్థ కోవిడ్-19 కిట్లను తయారు చేసి పుణె, ముంబై, ఢిల్లీ, గోవా, బెంగళూరుల్లోని డయాగ్నోస్టిక్ ల్యాబ్‌లకు పంపుతుంది. అందులోని వైరాలజిస్ట్‌ దఖావే భోసలే.. ఈ కిట్ తయారీ కోసం పనిచేస్తున్నప్పుడు.. ఆమె నిండు గర్భిణి కూడా. మార్చి 18న, ఆడపిల్లను కనడానికి సరిగ్గా ఒక్క రోజు ముందు… ఆమె కిట్‌ను పరిశీలన కోసం పుణేలోని ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’కి అందించారు.

షెఫాలి దేశాయ్:
షెఫాలి దేశాయ్.. ఇప్పటికీ తన రోజులో ఎక్కువ భాగం పూణేలోని మైలాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ ల్యాబ్‌లలో పనిచేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ టెస్టింగ్ కిట్లను సృష్టించేందుకు ఆమె కష్టపడుతున్నారు. “సరిహద్దుల్లోని మా సైనికుల మాదిరిగానే, మేము ఒక మహమ్మారిపై పోరాటంలో మన దేశం కోసం పోరాడటానికి సహాయపడుతున్నాం” అని ఆమె ఈ సంధర్భంగా అన్నారు. వాణిజ్య ప్రయోగశాలలలో 30ఏళ్ల క్లినికల్ డయాగ్నొస్టిక్ అనుభవం ఉన్న శాస్త్రవేత్తగా ఆమె నైపుణ్యం ఇప్పుడు దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

మిథాలీ పాటిల్:
మైలాబ్ ఉత్పత్తి చేస్తున్న అన్ని టెస్టింగ్ కిట్ల నాణ్యతను నిర్ధారించడానికి మిథాలీ పాటిల్, ఆమె టీమ్.. అదనపు షిఫ్టులను కూడా చేస్తున్నారు. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో, మైలాబ్ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని వారానికి 1,50,000 టెస్ట్ కిట్ల నుండి రెండు మిలియన్ యూనిట్లకు పెంచింది. ఇందులో పాటిల్ పాత్ర కీలకం.. మానవ తప్పిదాలు లేకుండా ఖచ్చితంగా నిర్వర్తించాల్సిన బాధ్యత ఆమెది. పెద్ద ఫార్మా, బయోటెక్ కంపెనీలలో ఒక దశాబ్దం గడిపిన పాటిల్.. దేశానికి అవసరం అయిన సమయంలో ఉపయోగపడడం తన “నైతిక బాధ్యత” అని చెబుతున్నారు.