Mini Jamili Elections: మినీ జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు.. 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు!

Mini Jamili Elections: మినీ జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు.. 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు!

Mini Jamili Elections Telangana assembly elections delayed

Semi Jamili Elections:  దేశంలో ఎన్నికల మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఓ వైపు తెలంగాణతో (Telangana) సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతుండగా, కేంద్రం జమిలి ఎన్నికలకు సన్నాహాలు చేస్తుండటం హీట్‌ పెంచుతోంది. ఇదే సమయంలో గడువు కన్నా ఆర్నెల్ల ముందుగా ఎన్నికలు నిర్వహించే అధికారం ఈసీకి ఉందంటూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ (Rajiv Kumar) చేసిన ప్రకటన సరికొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో.. ఈసీ ప్రకటన ప్రకారం మినీ జమిలి జరిగే చాన్స్‌ కనిపిస్తోంది. కేంద్రంతోసహా 11 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలా బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. జమిలి కుదరకపోతే సెమీ జమిలి.. మొత్తానికి పదికన్నా ఎక్కువ రాష్ట్రాలతోనే ఎన్నికలకు వెళ్లటానికి ప్రభుత్వం మొగ్గుచూపటానికి కారణాలేంటి?

దేశంలో మినీ జమిలి ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ ప్రకటనతో కేంద్రంతో పాటు మరో 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే చాన్స్‌ కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల కమిషన్‌. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాల్లో వచ్చే జనవరిలోగా ఎన్నికలు నిర్వహించాల్సివుంది. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ ఆయా రాష్ట్రాల్లో సన్నాహాలు మొదలుపెట్టింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లోక్‌సభకు, అన్నిరాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆధ్వర్యంలో 8 మంది సభ్యుల కమిటీ నియమించింది. ఆర్నెల్లలో ఈ కమిటీ జమిలి ఎన్నికలపై నివేదిక ఇవ్వాల్సివుంటుంది. ఐతే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించడం రాజ్యంగ పరంగా సాధ్యమయ్యే అవకాశం లేకపోవడంతో ఇతర మార్గాలను అన్వేషిస్తోంది కేంద్రం.. ఈ పరిస్థితుల్లోనే ప్రత్యామ్నాయంగా మినీ జమిలికి మార్గం సుగమం చేయాలని భావిస్తోంది.

ఏదైనా ప్రభుత్వానికి ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కల్పించింది మన రాజ్యాంగం.. అదేవిధంగా నిర్దేశిత సమయంలోగా షెడ్యూల్ విడుదల చేసి గడువు తర్వాత ఎన్నికలు నిర్వహించే సౌలభ్యం కూడా ఉంది. దీంతో వచ్చే ఏడాది జూన్‌ వరకు పదవీ కాలం ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు కాస్త ముందుగా ఎన్నికలు జరిపే అవకాశం పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెలంగాణతోపాటు ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ జనవరి 16లోగా ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. 2018 డిసెంబర్‌లో ఈ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగితే.. ఆ ఏడాది డిసెంబర్‌ 18న మిజోరాం శాసనసభ కొలువుదీరింది. అంటే ఈ ఏడాది డిసెంబర్‌ 17లోగా ఆ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాల్సివుంది.

Also Read: కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌ ఎన్ని స్థానాలు కేటాయిస్తుంది?

ఇక ఛత్తీస్‌గడ్‌కు వచ్చేఏడాది జనవరి 3 వరకు, మధ్యప్రదేశ్‌కు జనవరి 6 వరకు గడువు ఉంది. రాజస్థాన్‌కు జనవరి 14, తెలంగాణకు జనవరి 16 వరకు గడువు ఉండగా.. ఆ సమయంలోగా ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. ఈ గడువుకి మించి ఒక్కరోజు కూడా ప్రభుత్వాన్ని కొనసాగించే అధికారం ఎవ్వరికీ లేదు. దీంతో నవంబర్‌ నెలాఖరు లేదా.. డిసెంబర్‌ మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సివుంటుంది. ఇదే సమయంలో వచ్చే ఏడాది జూన్‌లో మరో నాలుగు రాష్ట్ర ప్రభుత్వపాలన ముగుస్తుంది. అంటే అర్నెల్లలో 9 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సివుంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఎన్నికలు జరగాల్సివుంది.

Also Read: తుమ్మలకు పాలేరు, మైనంపల్లికి ఫ్యామిలీ ప్యాక్.. కాంగ్రెస్‌లో చేరే బీఆర్ఎస్, బీజేపీ నేతలు వీరే..!

ఈ పరిస్థితుల్లో కేంద్రానికి ఈ 9 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలు పరిశీలిస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఈసీకి ఉన్న అధికారాలను వాడుకుని జూన్‌వరకు గడువు ఉన్న ఏపీ, ఒడిసా, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలను ముందుకు తెచ్చేలా ప్లాన్‌ చేస్తోంది కేంద్రం. తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గడ్‌, రాజస్థాన్‌, మిజోరాం రాష్ట్రాలకు డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదల చేసి జనవరిలో ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటోంది. తెలంగాణతోసహా ఐదు రాష్ట్రాలకు నవంబర్‌, డిసెంబర్‌ల్లో ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తుంటే.. ఇప్పుడు ఈసీ అధికారాలను వాడుకుని ఆ రాష్ట్రాల ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read: బీఆర్ఎస్ MLC పల్లాకు అధిష్టానం షాక్.. మంత్రి కేటీఆర్ సీరియస్ వార్నింగ్

ఇదే సమయంలో వచ్చేఏడాది డిసెంబర్‌లో మరో మూడు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ రాష్ట్రాలతో కలిపి మొత్తం 12 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది కేంద్రం. మహారాష్ట్ర, హరియాణ రాష్ట్రాలకు 2024 నవంబర్‌ వరకు, ఝార్ఖండ్‌కు 2025 జనవరి వరకు గడువు ఉంది. ఈసీ లెక్క ప్రకారం ఈ మూడు రాష్ట్రాలకు ఆర్నెల్ల గడువు వర్తించే అవకాశం లేదు. కానీ, మహారాష్ట్ర, హరియాణల్లో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వాలే ఉన్నందున ఆయా రాష్ట్రాల అసెంబ్లీ రద్దు తీర్మానాలు చేయించి ఎన్నికలకు వెళ్లే చాన్స్‌ ఉంది. జార్ఖండ్‌లో ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన జేఎంఎం ప్రభుత్వం ఉన్నందున బీజేపీ ప్రతిపాదనను ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది. కేంద్రం ప్రతిపాదనను ఝార్ఖండ్‌ ప్రభుత్వం తిరస్కరిస్తే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు గడువు ప్రకారమే జరిగే అవకాశం ఉంది. మిగిలిన 11 రాష్ట్రాలతో కేంద్రం మినీ జమిలి కోరిక తీర్చుకునే అవకాశం కనిపిస్తోంది.

Also Read: తెలంగాణలో జమిలి ఎన్నికలపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్

జూన్‌ వరకు కేంద్ర ప్రభుత్వానికి గడువు ఉన్నా.. జనవరిలోనే ఎన్నికలకు వెళ్లేలా కనిపిస్తోంది. ఈసీ ప్రకటనతో ఈ విషయంపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. మొత్తానికి జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆశలను సెమీ జమిలి ద్వారా తీర్చుకోవాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఖర్చు, పరిపాలన పరమైన కారణాలతో జమిలి ఎన్నికల ప్రతిపాదనలను తెరపైకి తెస్తున్నా.. జాతీయ అంశాలతో అధికారం నిలబెట్టుకోవాలనే బీజేపీ ఎత్తుగడే జమిలి ప్రతిపాదన వెనుక బలంగా ఉందని విశ్లేషిస్తున్నారు రాజకీయ పరిశీలకులు. కేంద్రం వ్యూహాం ప్రకారం వచ్చే ఏడాది జనవరిలో 11 రాష్ట్రాల అసెంబ్లీలతోపాటు లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనేది క్లియర్‌కట్‌ హాట్‌టాపిక్‌.