సుప్రీంకోర్టు మాదే..అయోధ్యలో రామమందిరమేనన్న మంత్రి : ఖండించిన సీజేఐ

  • Published By: venkaiahnaidu ,Published On : September 12, 2019 / 01:30 PM IST
సుప్రీంకోర్టు మాదే..అయోధ్యలో రామమందిరమేనన్న మంత్రి : ఖండించిన సీజేఐ

యూపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలపై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగొయ్ స్పందించారు. సుప్రీంకోర్టు మాదే.. అయోధ్యలో రామాల‌యాన్ని నిర్మించి తీరుతామంటూ మంత్రి ముకుత్ బిహారీ వ‌ర్మ రెండు రోజుల క్రితం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇవాళ సుప్రీంకోర్టు స్పందించింది. అయోధ్య కేసు విచార‌ణ స‌మ‌యంలో మంత్రి వ్యాఖ్య‌లను సీజేఐ రంజ‌న్ గ‌గోయ్ త‌ప్పుప‌ట్టారు. ఇలాంటి వ్యాఖ్య‌ల‌ను ధ‌ర్మాస‌నం ఖండిస్తున్న‌ద‌న్నారు.

రెండు రోజుల క్రితం యూపీ మంత్రి ముకుత్ బిహారీ వ‌ర్మ మాట్లాడుతూ. .. అయోధ్య‌లో రామ మందిరాన్ని నిర్మించ‌డం త‌మ ల‌క్ష్య‌మ‌ని, సుప్రీంకోర్టు త‌మ‌దే అని, న్యాయ‌వ్య‌వ‌స్థ‌, ఈ దేశం, ఈ ఆల‌యం అన్నీ త‌మ‌దే అన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తపర్చారు. అయితే అయోధ్య కేసులో అన్ని వ‌ర్గాల‌కు అనుకూల‌మైన తీర్పును వెల్ల‌డిస్తామ‌ని సీజేఐ తెలిపారు. అయోధ్య‌పై రోజువారీ విచార‌ణ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

ఇవాళ 22వ రోజున కూడా విచార‌ణ కొన‌సాగించారు. సున్నీ బోర్డు త‌ర‌పున సీనియ‌ర్ అడ్వ‌కేట్ రాజీవ్ ధావ‌న్ మాట్లాడారు. తానేమీ హిందువుల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌డం లేద‌ని, కానీ ముస్లింల‌కు బెదిరింపులు వ‌స్తున్నాయ‌న్నారు. చెన్నైకి చెందిన 88 ఏళ్ల ష‌ణ్ముగం అనే వ్య‌క్తి ఇటీవల అడ్వ‌కేట్ ధావ‌న్‌కు బెదిరింపు లేఖ రాశారు. ఈ అంశాన్ని ఆయ‌న కోర్టులో ప్ర‌స్తావించారు.