Monsoon : నైరుతి వచ్చేస్తోంది..తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్‌సూన్‌.

Monsoon : నైరుతి వచ్చేస్తోంది..తెలంగాణలో మూడు రోజులు వర్షాలు

Kerala

Monsoon Kerala : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు వస్తున్నాయి. 2021, జూన్ 03వ తేదీ గురువారం కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. కేరళ నుంచి కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎంట్రీ ఇవ్వనుంది మాన్‌సూన్‌. భారత వాతావరణ శాఖ అధికారుల ప్రకారం.. కేరళ సముద్ర తీరం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్ర ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడనున్నాయి.

నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని చెబుతోంది ఐఎండీ. అటు నుంచి జూన్ 12వ తేదీ నాటికి కర్ణాటక, ఏపీ, తెలంగాణ మీదుగా నైరుతి రుతుపవనాలు ప్రయాణిస్తాయి. వాస్తవానికి జూన్ 1నే కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయనుకున్నా.. రెండు రోజులు ఆలస్యంగా వస్తాయని ఐఎండీ వెల్లడించింది. కర్నాటక తీరంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు ఆలస్యమయ్యాయని చెప్పింది వాతావరణ శాఖ. నైరుతి రుతు పవనాలు ఒకసారి దేశంలోకి ప్రవేశించిన తర్వాత.. 4 నెలల పాటు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మొదట కేరళను తాకి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయి.

నైరుతి రుతు పవనాల ప్రభావంతో పాటు.. అరేబియా సముద్రంలో ఈదురుగాలుల కారణంగా కేరళ సహా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో మరో మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనుందని చెబుతోంది ఐఎండీ. ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లోనూ మంచి వర్షాలు కురుస్తాయన్నారు. అలాగే, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లోనూ పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరోవైపు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రైతులు ఖరీఫ్ పంటకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణకు మరో మూడు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. దీని కారణంగా రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలకు వచ్చే అవకాశముందన్నారు. ఈ ప్రభావంతో తెలంగాణలో 2021, జూన్ 03వ తేదీ గురువారం నుంచి మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్నారు. ముఖ్యంగా రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారిణి నాగరత్నం తెలిపారు.

Read More :AP CM Jagan : సొంతింటి కల నెరవేరబోతోంది.