SBIకి రూ.70కోట్ల టోకరా పెట్టిన ముంబై కంపెనీ

SBIకి రూ.70కోట్ల టోకరా పెట్టిన ముంబై కంపెనీ

బ్యాంకుల్లో జరిగే దొంగతనాల కంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఎగ్గొట్టే వారి జాబితానే ఎక్కువగా కనిపిస్తోంది. చిన్నాచితకా లోన్‌లు తీసుకున్నవారి ముక్కు పిండి వసూలు చేసే బ్యాంకులు కోట్లలో రుణాలు ఎగ్గొడితే కోర్టులకెక్కి న్యాయం కోసం  పడిగాపులు గాస్తున్నాయి. ఇటీవలే ముంబైలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. ముంబైకి చెందిన లివ్‌వెల్ ఎయిర్ టీమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫేక్ డాక్యమెంట్లు క్రియేట్ చేసి లోన్ తీసుకుంది. 

డబ్బులు చేతికందాక జెండే ఎత్తేసింది. చివరికి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ మానెక్ దవేర్, సీఈఓ బుర్జిన్ దవేర్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. కంపెనీ, డైరక్టర్లు 2015 నుంచి 2017 సమయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను మోసం చేసినట్లుగా ఆరోపణలు దాఖలైయ్యాయి. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏజెన్సీకి ఐదు దేశాలతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మలేసియా, సింగపూర్‌లలోనూ వీటి కార్యకలాపాలు జరిగినట్లు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2010లో ఢిల్లీ ఎయిర్‌పోర్టులో టెర్మినల్ 3వద్ద ఎయిర్‌బస్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ380ని తీసుకొచ్చిన తొలి కంపెనీగానూ ప్రగల్భాలు పలికారు. 

వీటన్నిటి విషయంలో ఫేక్ డ్యాక్యుమెంట్లు మాత్రమే చూపించారని సీబీఐ వెల్లడించింది. వీటి ఆధారంగానే రూ.61కోట్లను బ్యాంకు నుంచి వసూలు చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్ నిర్మాణం, క్యాబిన్‌లో ఇంటీరియర్ మరికొన్ని పనులు చేయాలని అంతమొత్తంలో డబ్బులు కేటాయించింది బ్యాంకు. కొన్ని నెలల తర్వాత ఎస్బీఐ ఓ ఆడిటర్‌ను నియమించి స్టాక్ ఆడిట్ తెలుసుకోవాలని ఆదేశించగా కంపెనీ మోసం బయటకు వచ్చింది.