చిన్న చెక్కపై అందమైన గ్రామాన్నే చెక్కేసాడు: నవయుగ జక్కన్న

  • Published By: nagamani ,Published On : September 28, 2020 / 11:24 AM IST
చిన్న చెక్కపై అందమైన గ్రామాన్నే చెక్కేసాడు: నవయుగ జక్కన్న

nagaland sculptor:కళాకారులు అంటే..కుంచె పట్టుకుని రంగులతో కాన్వాసులపై అద్భుతమైన పెయింటింగ్స్ వేసేవాళ్లే కాదు..చిన్న సుద్దముక్కతో నడిరోడ్డుపై బొమ్మలు గీసేవాళ్లు కూడా కళాకారులే. కాన్వాసుపై వేసినా..నడి రోడ్డుపై గీసినా అది కళాఖండమే. ఆ కళ ఉండే ప్రాంతం మారుతుందంతే. కళాకారుడి కుంచెకు కులం..మతం..పేదా గొప్పా తేడా లేదు. కుండలు చేసేవాడి చేతిలో మట్టి ముద్ద కూడా కళాఖండంగా రూపుదిద్దుకుంటుంది. అటువంటి కళాకారుడే నాగాలాండ్ కు చెందిన ‘‘నింగ్వాన్ జింగ్‌ఖై’’.


నింగ్వాన్ కుండలు చేస్తూ..వాటిని అమ్ముకుని జీవిస్తుంటాడు. మట్టి ముద్దలతో కుండలు తయారు చేస్తున్నప్పుడల్లా అతని మనస్సులో ఓ అందమైన గ్రామం కళ్లల్లో మెదులుతుండేది. పచ్చని పొలాలు..బావులు..జలపాతాలు..జిగేలుమనే మెరిసే లైట్లు..వంతెనలు అందమైన పూరి గుడిసెలు..చూడ చక్కని ఇళ్లు అవన్నీ ఒకేచోట ఉంటే ఎంతబాగుంటుంది? చూడటానికి రెండు కళ్లూ చాలవు కదా? అటువంటి ఓ కళాఖండాన్ని సృష్ఠించాలని అతని మనసు పదేపదే పోరింది. ఆ సృష్టి కోసం తపన పడేవాడు. కానీ చేతిలో సరిపడా డబ్బులు లేవు. కానీ అతని కళాహృదంయ మాత్రం ఊరుకునేది కాదు. ఎలాగైనా సరే చేయాలని తపన పడేవాడు.ఈ దృశ్యాన్ని పదే పదే ఊహించుకునే అతని మనస్సు నిలిచేది కాదు.


మనస్సు ఎప్పుడూ మనషి మాట వినదు కదా..అలా మనస్సు మాటనే విన్న అతను అప్పు చేసి మరీ అద్భుతమైన కళాఖండాన్ని సృష్టించాడు. ఒక చెక్కపై ఓ గ్రామ దృశ్యాన్ని మొత్తం చెక్కేసి అందరినీ సంబ్రమాశ్చర్యాలకు గురిచేసాడు ‘‘నింగ్వాన్ జింగ్‌ఖై’’


నింగ్వాన్ చిన్నప్పటినుంచే చెక్కతో అందమైన ఆకృతులు చెక్కే కళ అంటే ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే ఎవ్వరి దగ్గరా నేర్చుకోకుండానే కనిపించిన చిన్న చిన్న చెక్క ముక్కలమీద తన మనస్సుకు తోచింది చెక్కుతుండేవాడు. అలా తన మనస్సులో రూపుదిద్దుకున్న గ్రామాన్నని ఒక చెక్క బల్లపై నమ్మశక్యంకాని రీతిలో విశాలమైన గ్రామ దృశ్యాన్ని చెక్కాడు.


ఆ అందమైన దృశ్యంలో ఆకట్టుకునే ఇళ్లు, పర్ణశాలవంటి గుడిసెలు, జలపాతం, లైట్లు, వంతెన, పొలాలు, బావులు, వీధులు ఇలా ప్రతీ అంశాన్ని ఎంతో స్పష్టంగా చెక్కి ఔరా.. అనిపించాడు. దాన్ని చూసి గ్రామస్తులందరూ ఎంతో సంతోషించాడు. కుండలు చేసే నీ చేతులు ఇంత అద్భుతం చేస్తాయని తెలియదురా..అంటూ ప్రేమగా అతన్ని పొగుడుతున్నారు. దాన్ని చూసి మురిసిపోతున్నారు. నింగ్వాన్‌ను మనస్ఫూర్తిగా ప్రశంసిస్తున్నారు. ఆ కళాఖండానికి గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్‌గా కూడా మార్చేశాడు నింగ్వాన్.ఇదంతా పూర్తిచేయడానికి అతడికి ఏడాది సమయం పట్టిందట. రూ.1.70 లక్షలు ఖర్చు అయిందని నింగ్వాన్ తెలిపాడు. అతని అద్భుత కళను నేషనల్ మీడియా గుర్తించటంతో నింగ్వాన్ ఫేమస్‌ అయిపోయాడు.


కాగా..ఏడాది కష్టపడి సృష్టించిన ఆ కళాఖండాన్నిరూ.20 లక్షలకు విక్రయించి..ఆ డబ్బుతో తన కుటుంబ పోషణం కోసం ఉపయోగించుకుంటానని నింగ్వాన్ తెలిపాడు. భవిష్యత్తులో ఉక్రుల్ జిల్లాలోని ఫాంగ్రే పీఠభూమి వద్ద 100×50 మీటర్ల విస్తీర్ణంలో ఉన్న యేసుక్రీస్తు, అతడి 12 మంది శిష్యుల ప్రకృతి దృశ్యాన్ని చెక్కపై చెక్కాలనేది తన కలట. అదే విషయాన్ని చెప్పాడు నింగ్వాన్.అతని కల నెరవేరాలని..నింగ్వాన్ చేతిలో మరిన్ని అద్భుతమైన కళాఖండాలు రూపుదిద్దుకోవాలని కోరుకుందాం..ఆ గ్రామ కళాఖండాన్ని ఎవరు దక్కించుకుంటారో చూడాలి. నింగ్వాన్న లాంటి అద్భుత కళాకారుల్ని ప్రోత్సహించాల్సిన అవసరం చాలా ఉంది.