భారత్-పాక్ సరిహద్దుల్లో ఇక కాల్పులుండవ్..తెర వెనుక మంత్రాంగం నడిపిన దోవల్

భారత్-పాక్ సరిహద్దుల్లో ఇక కాల్పులుండవ్..తెర వెనుక మంత్రాంగం నడిపిన దోవల్

NSA Doval కార్గిల్ యుద్ధం తర్వాత సరిహద్దులో శాంతి స్థాపనే ధ్యేయంగా భారత్- పాకిస్తాన్ దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఆ ఒప్పందానికి తూట్లు పొడుతూ ఎల్ఓసీ వెంబడి తరచూ పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండటం, భారత బలగాలు ధీటుగా జవాబిస్తుండటం పరిపాటిగా మారింది. అయితే, బుధవారం రాత్రి నుంచి మాత్రం సరిహద్దు వెంబడి పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోయాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్యంగా జరిపిన మంతనాలు ఫలించాయి.

భారత్- పాకిస్తాన్ దేశాల సైన్యాలు గురువారం ఓ సంచలన నిర్ణయానికి వచ్చాయి. జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని పరస్పర అంగీకారానికి వచ్చాయి. అలాగే, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా ఎలాంటి ఉద్రిక్తతలకు తావు ఇవ్వరాదని నిర్ణయించుకున్నాయి. ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో ఇరు దేశాల డీజీఎస్‌ఎంవో(director generals of military operations) స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అని ఇరు దేశాల అధికారులు గురువారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు.

తాజాగా కుదిరిన అంగీకారంతో ఈనెల 24(బుధవారం) అర్ధరాత్రి నుంచి సరిహద్దుకు రెండు వైపులా కాల్పులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, పరస్పర అంగీకారం కుదిరినప్పటికీ, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంటాయని, అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే మోహరింపు కొనసాగింస్తున్నామని అధికారులు తెలిపారు.

అయితే, సరిహద్దుల్లో శాంతిస్థాపనకు తెర వెనుక భారత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్ చాలానే కృషి చేసినట్లు సమాచారం. 2003నాటి కాల్పుల విరమణ ఒప్పందం పక్కాగా అమలయ్యేలా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్..కొన్ని నెలలుగా పాకిస్తాన్ తో రహస్య మతనాలు చేశారని, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్‌తో దోవల్ చాలా రోజులుగా డైరెక్ట్ గా టచ్ లో ఉన్నారని.. పలు దఫాలుగా ఆయనతో చర్చలు జరిపారని, దోవల్ కృషి వల్లే రెండు దేశాల సైన్యాలు గురువారం నాటి ప్రకటనను వెలువరించాయిని తెలుస్తోంది. దోవల్ సీక్రెట్ టాక్స్ ముచ్చట ప్రధాని మోడీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్‌ లాంటి అతి కొద్ది మందికే తెలుసని ఢిల్లీ వర్గాలు తెలిపాయి.