BCCI Secretary Jay Shah: అమిత్ షా తనయుడు జైషాపై ప్రతిపక్షాల విమర్శల దాడి.. త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు తిరస్కరించిన వీడియో వైరల్

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షా‌పై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జైషా తీరును తప్పుబడుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అనంతరం జైషా వద్దకు ఓ వ్యక్తి వచ్చి జాతీయ జెండాను ఇచ్చే ప్రయత్నం చేశాడు. అయితే షా దానిని తిరస్కరించిన వీడియో వైరల్ గా మారింది.

BCCI Secretary Jay Shah: అమిత్ షా తనయుడు జైషాపై ప్రతిపక్షాల విమర్శల దాడి.. త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేందుకు తిరస్కరించిన వీడియో వైరల్

BCCI secretary Jay Shah

BCCI Secretary Jay Shah: ఆసియా కప్ – 2022లో భాగంగా ఈ నెల 28న పాకిస్థాన్ వర్సెస్ భారత్ మధ్య దుబాయ్‌లో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాక్‌పై ఐదు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. విజయం అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షా‌కు ఓ వ్యక్తి భారతీయ త్రివర్ణ పతాకాన్ని అందజేశారు. బీసీసీఐ కార్యదర్శి జైషా మాత్రం దానిని తీసుకొనేందుకు తిరస్కరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రతిపక్ష నాయకులు జైషా పై విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు.

పలువురు కాంగ్రెస్ నేతలు ఈ వీడియో పుటేజ్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమిత్ షా కుమారుడు జైషా పై విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ జైషా భారతీయ జెండాను తీసుకొనేందుకు తిరస్కరిస్తున్న వీడియోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసి ‘నాకు పాప ఉంది, త్రివర్ణ పతాకాన్ని మీ వద్ద ఉంచుకోండి’ అంటూ హిందీలో శీర్షిక ఇచ్చారు. కాంగ్రెస్ నేత అజోయ్ కుమార్ కూడా ఈ పుటేజీని ట్వీట్ చేస్తూ హిందీలో ఇలా వ్రాశాడు.. “త్రివర్ణ పతాకం ‘ఖాదీ’ది.. ‘పాలిస్టర్’ది కాదు!” అంటూ జైషా పై విమర్శలు చేశారు. పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించిన తర్వాత జైషా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు ఎందుకు నిరాకరిస్తారని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ప్రశ్నించారు. జాతీయ జెండాను ఇప్పుడు పాలిస్టర్ తో, యంత్రాల సహాయంతో తయారు చేసే ప్లాగ్ కోడ్ సవరణపై కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ గా మారిన జైషా వీడియోపై శివసేన రాజ్యసభ సభ్యులు ప్రియాంక చుతుర్వేది, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తృణమూల్ నాయకుడు డెరెక్ ఓ బ్రెయిన్, టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే ఇలా పలు విపక్ష పార్టీల నేతలు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ కుమారుడు జై షాపై సోషల్ మీడియా వేదికగా విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.