Pearls Harvest : ఇంట్లోనే ముత్యాలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న రైతు

ప్రకృతి ప్రసాదించిన నవరత్నాలలో ముత్యం కూడా ఒకటి. ముత్యపు చిప్పలలో నుండి ఈ ముత్యాలు తయారవుతాయి. మహిళలు ముత్యాలను తమ ఆభరణాలలో అలంకరణకు వాడతారు.

Pearls Harvest : ఇంట్లోనే ముత్యాలు పండిస్తూ లక్షలు సంపాదిస్తున్న రైతు

Pearls Harvest

Pearls Harvest : ప్రకృతి ప్రసాదించిన నవరత్నాలలో ముత్యం కూడా ఒకటి. ముత్యపు చిప్పలలో నుండి ఈ ముత్యాలు తయారవుతాయి. మహిళలు ముత్యాలను తమ ఆభరణాలలో అలంకరణకు వాడతారు. ముత్యాల ఆభరణాలంటే వారికి ఎంతో మక్కువ. చైనా, జపాన్, మయన్మార్ దేశాలలో ముత్యాలసాగు పెద్ద వ్యాపారంగా సాగుతోంది. 5వేల500 సంవత్సరాలుగా ఈ ముత్యాలను ఆభరణాలుగా ప్రపంచంలో వినియోగిస్తున్నట్లు చరిత్ర అధారాలు కూడా ఉన్నాయి. సాధారణంగా ముత్యాలు నదులు, సముద్రాలు, చెరువుల్లో దొరుకుతాయని తెలుసు. కానీ కేరళకు చెందిన ఒక రైతు ఏకంగా తన పెరట్లో ముత్యాలు పండిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంట్లోనే ముత్యాలు సాగుతో పాపులర్ అయ్యాడు.

కేరళకు చెందిన మతాచన్ సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. ఉన్నత చదువుల చదువుకుని సౌదీ అరేబియాలోని ధారన్ లోగల కింగ్ ఫాధ్ పెట్రోలియం అండ్ మినరల్ యూనివర్శిటీలో టెలికమ్యునికేషన్స్ డిపార్టుమెంట్ లో ఫ్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఆ సమయంలో యూనివర్సిటీ పని మీద చైనాకు వెళ్ళాల్సి వచ్చింది. చైనాలోని ధనుష్షీ ఫిషరీస్ రీసర్చి సెంటర్ లో పలు కోర్సులు నేర్చుకోవాలన్న ఆసక్తి కలిగింది. వెంటనే ముత్యాల సాగులో డిప్లొమా కోర్సులో చేరాడు. ఈ తరహా విద్యను భారత దేశంలో కొద్దిమంది మాత్రమే చదివారు.

తన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 1999లో తిరిగి కేరళకు చేరుకున్న మతాచన్… తన ఇంటి పెరట్లోనే ముత్యాల సాగు మొదలు పెట్టాడు. నదులలో దొరికే ఆల్చిప్పటలను తెచ్చి 18 నెలలు బకెట్లో వాటిని ఉంచి ముత్యాలను ఉత్పత్తి చేస్తాడు. ఈ 18 నెలల కాలంలో 50 బక్కెట్ల ముత్యాలను ఉత్పత్తి చేయటం ద్వారా రూ.4.5లక్షల సంపాదిస్తాడు. గత 20 సంవత్సరాలుగా ఇదే పని చేస్తున్నాడు. ఉత్పత్తి చేసిన ముత్యాలలో ఎక్కువ భాగాన్ని అస్ట్రేలియా, సౌదీ అరేబియా, కువైట్, స్విట్జర్లాండ్ తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. ముత్యాల సాగుకోసం మతాచన్ ప్రారంభ పెట్టుబడి లక్షన్నర మాత్రమే. తొలిగా అతను అందుకున్న లాభం రూ.3లక్షలు. తొలి లాభంతో వెనుదిరిగి చూడకుండా ముత్యాల సాగులో ముందుకు సాగుతూ లాభాలు గడిస్తున్నాడు.

ముత్యాలసాగును చేపట్టిన తొలినాళ్ళల్లో మతాచన్ చేస్తున్న పని చూసి ఇరుగు పొరుగువారు, స్నేహితులు అంతా హేళన చేశారు. అయితే పెరట్లో పండించిన ముత్యాలను చూసి వారంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం మతాచాన్ స్ధానిక నిరుద్యోగ యువతకు ముత్యాల సాగుపై ఆన్ లైన్ శిక్షణ ఇస్తున్నాడు. శిక్షణ కోసం రూ.10వేలు ఫీజుగా తీసుకుంటున్నాడు. చాలామంది రైతులు మతాచన్ దగ్గర శిక్షణ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

మంచి నీటి సరస్సుల దగ్గర విరివిగా దొరికే ముత్యపు చిప్పలతో మన దేశంలో కూడా ముత్యాల సాగు చేపడితే ఆర్ధికంగా చాలామందికి మేలు కలుగుతుందని మతాచన్ సూచన చేస్తున్నాడు. యువత ముత్యాల సాగువైపు ఆసక్తి చూపిస్తే మంచి అదాయాన్ని పొందవచ్చని చెబుతున్నాడు.