ఇది ‘ప్లాస్టిక్’​ను తింటుంది

  • Published By: venkaiahnaidu ,Published On : September 20, 2020 / 06:32 PM IST
ఇది ‘ప్లాస్టిక్’​ను తింటుంది

సాధారణంగా మనకు కీటకాలు అనగానే పంటపొలాలను నాశనం చేసే రక్కసి పురుగులే గుర్తొస్తాయి. వాస్తవానికి చాల కీటకాలు ప్రకృతిని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంటాయి కూడా. అంతేకాకుండా పూల పరాగ రేణువులను ఓ మొక్క నుంచి మరో మొక్కకు మోసుకెళ్లి పంటసాగులో ఎంతో సాయం చేస్తాయి కీటకాలు.

అయితే, ఇప్పుడు పర్యావరణానికి హాని కలిగిస్తున్న “ప్లాస్టిక్” పనిపట్టేందు మళ్లీ వాటినే రంగంలోకి దించుతున్నారు కర్ణాటకలోని ధార్వాడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. భూమిలో కరగని ప్లాస్టిక్ ​ను సునాయసంగా నాశనం చేసి, పర్యావరణానికి పునర్జీవం పోసే సరికొత్త కీటకాన్ని ధార్వాడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు.


ధార్వాడ్ యూనివర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగంలో పరిశోధకుడు శీతల్ కేశ్వీ…చిన్న గొంగలి పురుగులా బియ్యం సంచులో కనిపించే ‘రైస్ మోత్ లార్వా’ కీటకాన్ని ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు. ఎండిపోయిన తేనెతుట్టెలను ప్లాస్టిక్ సంచిలో ఉంచి.. రైస్ మోత్ లార్వా కీటకాలను అందులో వేశారు. కొద్ది రోజులకు సీతాకోక చిలుకలా రెక్కలతో విచ్చుకున్న ఆ కీటకం.. ప్లాస్టిక్ సంచికి రంధ్రాలు చేసుకొని బయటకు రావడం గమనించారు.

అంటే, ప్లాస్టిక్​ను ఆ చిన్ని కీటకం కొంతమేర నాశనం చేయగలుగుతుందని గ్రహించారు. ఆపై ఆ కీటకాలకు పోషకాహారం అందించి, ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులపైనా ప్రయోగించి సత్ఫలితాలు పొందారు. శీతల్ కేశ్వీ అధ్యయనం అంతర్జాతీయ జర్నల్​ లో కూడా ప్రచురితమైంది.


దేశంలో అనేక కీటకాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి కానీ, ఈ బియ్యపు పురుగుతో ప్లాస్టిక్​ను నాశనం చేసేందుకు జరిగిన అధ్యనం చేయడం మాత్రం ఇదే తొలిసారి.అని శీతల్ కేశ్వీ తెలిపారు. స్పెయిన్ ప్రయోగాన్ని అధ్యయనం చేశాకే తనకు ప్లాస్టిక్ అంతం.. కీటకాలతో ప్లాస్టిక్ వినాశనం అనే రెండు అంశాలపై ప్రయోగం మొదలెట్టాలన్న ఆలోచన వచ్చిందని శీతల్ తెలిపారు.