Maha Jansampark Abhiyan : ఎలక్షన్ మూడ్‌లోకి బీజేపీ.. దేశంలో మూడోసారి అధికారం కోసం స్కెచ్

దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాషాయ దళం. గతంతో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది.

Maha Jansampark Abhiyan : ఎలక్షన్ మూడ్‌లోకి బీజేపీ.. దేశంలో మూడోసారి అధికారం కోసం స్కెచ్

Maha Jansampark Campaign : మోదీ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా.. జన సంపర్క్ అభియాన్ తో జనాల్లోకి వెళ్తున్నారు బీజేపీ నేతలు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 51కి పైగా భారీ
ర్యాలీలు, 5 వందలకుపైగా బహిరంగ సభలు, 5 వందలకు పైగా లోక్‌సభ, 4 వేల అసెంబ్లీ నియోజకవర్గాల్లో 6 వందలకుపైగా మీడియా సమావేశాలు పెట్టనున్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు (rajasthan assembly election) సహా లోక్‭సభ ఎన్నికలు (lok sabha election)లక్ష్యంగా రాజస్థాన్‭ (rajasthan)లో మెగా ప్రచారాన్ని ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు.

అజ్మీర్ (Ajmer) నుంచి ప్రారంభమైన ఈ జన సంపర్క్ అభియాన్.. జూన్ 30వరకు కొనసాగనుంది. ఈ ర్యాలీకి ముందు ప్రదాని మోదీ బ్రహ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కమలదళంలో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేశారు. మోదీ దేశవ్యాప్తంగా 12 ర్యాలీలు నిర్వహించనున్నారు. జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, స్మృతీ ఇరానీ కూడా ర్యాలీల్లో పాల్గొననున్నారు. మోదీ సహా సీనియర్‌ నేతలు దేశవ్యాప్తంగా మొత్తం 51 ర్యాలీలు నిర్వహిస్తారు. 3, 4 లోక్‌సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా మొత్తం 543 నియోజకవర్గాలను 144 క్లస్టర్లుగా విభజించారు. ప్రతి క్లస్టర్‌లోనూ మంత్రులు సహా ఇద్దరు సీనియర్‌ నేతలు ఎనిమిది రోజులు గడిపేలా ప్రణాళిక రూపొందించారు.

కాషాయ దళం పకడ్బందీ ప్రణాళిక
దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతోంది కాషాయ దళం. గతంతో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని పట్టుదలతో ఉంది. అందుకోసం పకడ్బందీ ప్రణాళికనే అమలు చేస్తుంది. ఈ
ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ జాతీయ నాయకత్వం పక్కావ్యూహంతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రంలో
రెండుసార్లు అధికారం కైవసం చేసుకున్న కమలం పార్టీ ముచ్చటగా మూడోసారి పగ్గాలు చేపట్టాలనే ధృడ సంకల్ఫంతో ముందుకెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయాలు సాధించి లోక్‌సభ ఎన్నికలకు మార్గం సుగమం
చేసుకోవాలని ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది కమలం పార్టీ.

5 రాష్ట్రాల కోసం పక్కా ప్రణాళికలు
ఈ ఏడాది ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల కోసం పక్కా ప్రణాళికలు అమలు చేసేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, రాజస్థాన్‌ రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఈ రాష్ట్రాల్లో ఒక్క చోట మాత్రమే ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌తో పాటు అధికారంలో లేని 4 రాష్ట్రాల్లోనూ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తులు వేస్తోంది. కర్ణాటక ఎన్నికలు పూర్తవటంతో
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు పావులు కదుపుతున్న కమలదళం ప్రచారం విషయంలో కర్ణాటకకు మించి దృష్టి సారించే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే గతేడాది నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత
కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.

Also Read: ఐఫోన్ పట్టుకుని హలో మిస్టర్ మోదీ.. అంటూ రాహుల్ గాంధీ జోక్స్.. ఎందుకంటే?

ప్రవాస్‌ యోజన పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు
మధ్యప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా.. ఆ తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటైంది. ఇక్కడ ఈ సారి మళ్లీ జెండా ఎగురవేయాలని భావిస్తోంది. మిగతా 3 రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలోనే
బీజేపీకి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు సునాయసానికి బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఇందులో
భాగంగానే దేశవ్యాప్తంగా బలహీనంగా ఉన్న 160 పార్లమెంటు స్థానాలను గుర్తించింది. దేశవ్యాప్తంగా 160 స్థానాల్లో పార్లమెంట్‌ ప్రవాస్‌ యోజన పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, కేంద్రమంత్రులను ఇన్‌ఛార్జీలుగా
నియమించింది. వారి ద్వారా కేంద్రప్రభుత్వ పథకాల అమలుతీరు, రాష్ట్రాలకు అందిస్తున్న సాయంతో పాటు విపక్ష పార్టీల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అలాగే బూత్‌ కమిటీ, శక్తి కేంద్రాలతో సమావేశమవుతూ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేస్తున్నారు.

కర్ణాటక ఫలితాల తర్వాత మారిన బీజేపీ వ్యూహాలు.. వివరాలకు ఈ వీడియో చూడండి