డ్రాగన్ కు దబిడిదిబిడే : దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకను మోహరించిన భారత్

డ్రాగన్ కు దబిడిదిబిడే : దక్షిణ చైనా సముద్రంలో యుద్ధ నౌకను మోహరించిన భారత్

దేశ రక్షణ విషయంలో భారత్ ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. చైనాపై సై అంటే సై అంటోంది. భారత్‌- చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో డ్రాగన్‌ దూకుడుకు చెక్‌ పెట్టేందుకు భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు నెలల క్రితం గల్వాన్ ‌లోయలో భారత్‌-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన కొద్ది నెలల అనంతరం దక్షిణ చైనా సముద్ర జలాల్లో ఒక కీలక యుద్ధ నౌకను భారత్ మోహరించింది.

సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో చైనా పెత్తనం చెలాయిస్తున్న దక్షిణ చైనా సముద్ర జలాలకు భారత్ యుద్ధ నౌక వెళ్లింది. గత కొన్ని రోజులుగా అక్కడే ఉండి చైనా సైనిక కార్యకలాపాలపై నిఘా ఉంచింది. దక్షిణ చైనా సముద్రం ఆవల గస్తీ కాస్తున్న అమెరికా యుద్ధ నౌకలతో భారత యుద్ధనౌక సంప్రదింపులు జరిపి సమాచారాన్ని పంచుకుంటోంది.

దక్షిణ చైనా సముద్రంలో భారత్ యుద్ధ నౌక మోహరింపుపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనివల్ల తమ సైనిక కార్యకలాపాలకు విఘాతం కలుగుతున్నదని పేర్కొంది. మరోవైపు హిందూ మహా సముద్రంలో యుద్ధ నౌకలను భారత్ భారీగా మోహరించింది. చైనా రవాణా నౌకలు ప్రయాణించే అండమాన్ నికోబార్ దీవుల సమీపంలోని మలక్కా స్ట్రెయిట్స్‌పై పూర్తి నిఘాను పెట్టింది.

చైనా నేవీ కదలికలపై భారత యుద్ధ నౌకలు కన్నేసి ఉంచాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఇండియన్ నేవీ సన్నద్ధంగా ఉన్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి. మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై చైనా ప్రాబల్యానికి చెక్‌ పెట్టేందుకు అమెరికా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే