Mission 2024 : మోదీని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ ? పవార్‌‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ

2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయా ? ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ మొదలైందా? బెంగాల్‌, తమిళనాడులో ఎన్నికలలో తృణమూల్‌. డీఎంకేలను అధికారంలోకి తెచ్చిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.

Mission 2024 : మోదీని ధీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ ? పవార్‌‌తో ప్రశాంత్ కిశోర్ భేటీ

Pawar

Prashant Kishor And Sharad Pawar : 2024 లోక్‌సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయా ? ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ మొదలైందా? బెంగాల్‌, తమిళనాడులో ఎన్నికలలో తృణమూల్‌. డీఎంకేలను అధికారంలోకి తెచ్చిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ను కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

మమతా బెనర్జీ, స్టాలిన్‌లకు భారీ విజయం సాధించడానికి మద్దతిచ్చిన ప్రతినేతను ప్రశాంత్‌ కిశోర్‌ కలుసుకుంటున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2024 ఎన్నికలే లక్ష్యంగా ప్రశాంత్‌ కిశోర్‌ స్కెచ్‌ వేస్తున్నట్లు సమాచారం. మోదీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాల తరపున ఉమ్మడి నేత కోసం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రశాంత్‌ కిశోర్‌ శరద్‌ పవార్‌తో భేటి అయ్యారని సమాచారం. తాను ఇకపై వ్యూహకర్తగా పనిచేయనని 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

బెంగాల్‌లో విజయం తర్వాత కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన లక్ష్యమని శపథం చేశారు మమతా బెనర్జీ. కేంద్రంలోని బీజేపీ.. తన ప్రత్యర్థులు అధికారంలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష కనబరుస్తూ, కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపణ. కేంద్రంపై పోరాటానికి రాష్ట్రాలు యూనియన్‌లా ఏర్పడాలని, యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పేరుతో ఒక్కటై పోరాడదామని ఆమె పిలుపునిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు రాష్ట్రాలన్నీ కలసి ముందుకు సాగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతృత్వంపై ఆశలు సన్నగిల్లడంతో ప్రతిపక్షాలు కొత్త నేతను తెరపైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

ఇక ప్రశాంత్‌ కిశోర్‌ విషయానికి వస్తే..గతంలో నరేంద్ర మోదీ, మమతాబెనర్జీ, కెప్టెన్‌ అమరిందర్‌సింగ్, ఉద్ధవ్‌ థాక్రే, స్టాలిన్, జగన్‌ వంటి నేతలకు ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. ప్రతిపక్ష పార్టీల మధ్య సమన్యయం కుదిర్చేందుకు ప్రస్తుతం కృషి చేస్తున్నారు. మరోవైపు మహారాష్ట్రలో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఎన్సీపీ-శివసేన-కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయని శరద్‌పవార్‌ ఇదివరకే ప్రకటించారు. మరి..నేతల ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

Read More : Shamshabad Airport: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు ఘనస్వాగతం