వంటల చానల్ లో రాహుల్ గాంధీ, ఏం చేశారంటే

వంటల చానల్ లో రాహుల్ గాంధీ, ఏం చేశారంటే

Mushroom Biriyani

Rahul Gandhi Eats Mushroom Biriyani : ఒక వంటల చానల్‌లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కనిపించడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అతి త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ. అక్కడ విస్తృతంగా పర్యటించారు. రోడ్ షోలు నిర్వహించారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో పర్యటించడం, ప్రచారం నిర్వహించడం అన్ని రాజకీయ పార్టీల నేతలూ చేసే పనే. అయితే తమిళనాడు పర్యటనలో రాహుల్ వినూత్నంగా మరో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకృతి ఒడిలో సహజ సిద్ధ వంటకాలతో అలరించే విలేజ్ కుకింగ్ చానల్ బృందంతో కలిసి గడిపారు రాహుల్.

కుకింగ్ చానల్ కు మంచి ఆదరణ :-
విలేజ్ కుకింగ్ చానల్‌కు తమిళనాడు వ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. దేశ విదేశాల్లోనూ లక్షల మంది ప్రజలు ఈ చానల్‌ను వీక్షిస్తుంటారు. తమిళనాడులోని పుడుక్కొట్టై జిల్లా చిన్న వీరమంగళానికి చెందిన పెరియతంబి విలేజ్ కుకింగ్ చానల్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ చానల్‌కు 71 లక్షల పది వేల మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. సహజ సిద్ధంగా తయారు చేసుకున్న దినుసులతో కట్టెల పొయ్యిపై వంట చేయడం పెరియతంబి ప్రత్యేకత.

వంట చేసిన రాహుల్ :-
అల్లం, వెల్లులి పేస్ట్, పచ్చికారం, మసాలా పొడులు అన్నీ అప్పటికప్పుడు తయారు చేసుకుంటారు. తర్వాత కట్టెల పొయ్యిపై వంట చేస్తారు. ఒక్కో ఐటెమ్ పేరు, ప్రత్యేకత చెబుతూ, వాటి గురించి వివరిస్తూ వంట తయారుచేస్తారు పెరియతంబి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, మష్ రూమ్ బిర్యానీతో పాటు అనేక రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలు నోరూరిస్తాయి.
తమిళనాడు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ విలేజ్ కుకింగ్ బృందాన్ని కలిశారు. మష్ రూమ బిర్యానీ తయారీ విధానాన్ని చూసి, వారితో కలిసి వంట చేశారు. తర్వాత వారితో కలిసి ఆ బిర్యానీ రుచి చూశారు. బిర్యానీ భేష్ అంటూ తమిళంలో ప్రశంసించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పోస్టు చేసిన గంటల వ్యవధిలో 5లక్షల మంది వీక్షించారు. పెరియతంబి రుచికరమైన వంటకాలు తయారుచేయడంతో ఆగిపోరు. ఆ వంటలను నిరుపేదలకు, అనాథలకు రుచి చూపిస్తారు.