రాజధాని హింస..రైతుల ముసుగులో చొరబడ్డ సంఘ విద్రోహ శక్తుల పనే

రాజధాని హింస..రైతుల ముసుగులో చొరబడ్డ సంఘ విద్రోహ శక్తుల పనే

Samyukta Kisan Morcha సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఇవాళ ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్​ ర్యాలీ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను సంయుక్త కిసాన్​ మోర్చా తీవ్రంగా ఖండించింది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేసింది. తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘాలు, వ్యక్తులు నిర్ధరిత మార్గాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. సంఘ వ్యతిరేక శక్తులు ర్యాలీలో చొరబడటం వల్లే హింసాత్మక ఘటనలు జరిగాయని పేర్కొంది. వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

శాంతి తమ అతిపెద్ద బలమని… కొన్ని సంస్థలు, వ్యక్తులు ఈ మార్గాన్ని ఉల్లంఘించారని తెలిపింది. నిబంధనలను పాటించని వారితో మాకు ఎలాంటి సంబంధం లేదు. నిర్ణయించిన మార్గంలో.. పరేడ్​ నిబంధనల మేరకు ర్యాలీ జరపాలని నిర్ణయించుకొన్నాం. హింసాత్మక చర్యలకు పాల్పడొద్దని, జాతీయ చిహ్నానికి కళంకం తేవొద్దని ముందస్తుగానే అనుకున్నాం. హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఓ ప్రకటనలో సంయుక్త కిసాన్​ మోర్చా పేర్కొంది.

రిపబ్లిక్​ డే ట్రాక్టర్​ ర్యాలీలో పాల్గొన్న అన్నదాతలకు రైతు సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు. అక్కడక్కడా జరిగిన అల్లర్లను నేతలు ఖండించారు. ఇలాంటి ఘటనలు ఎంతమాత్రం ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నారు. అలాంటి వారితో తాము కలిసి పోరాడాలని అనుకోవడం లేదని వివరించారు. శాంతియుతంగా చేపట్టిన ర్యాలీని.. కొందరు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని రైతుసంఘం నాయకుడు రాకేశ్​ తికాయత్​ ఆరోపించారు. అయితే వారిని అన్నదాతలు గుర్తించారని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా అందులో ఉన్నట్లు స్పష్టం చేశారు.

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం కొంతకాలంగా శాంతియుతంగా జరుగుతున్న అన్నదాతల ఆందోళనలు మంగళవారం ఉద్రిక్తతలకు దారితీశాయి. నిజానికి రాజ్‌ప‌థ్‌లో గ‌ణతంత్ర వేడుక‌లు ముగిసిన త‌ర్వాత రైతులు త‌మ ట్రాక్ట‌ర్ ప‌రేడ్ చేప‌ట్ట‌డానికి అనుమ‌తి ఇచ్చారు. కానీ రైతులు మాత్రం ఉద‌యం 8 గంట‌ల‌కే స‌రిహ‌ద్దులు దాటి ఢిల్లీలోకి దూసుకువ‌చ్చారు. ట్రాక్టర్​ ర్యాలీ కోసం.. రైతులు పోలీసుల వలయాన్ని ఛేదించుకుని ఢిల్లీలోకి ప్రవేశించగా పలు చోట్ల ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి.

ట్రాక్టర్ పరేడ్​కు పోలీసులు నిర్దేశించిన మార్గాలు కాకుండా ఇతర మార్గాల్లో ట్రాక్టర్​ ర్యాలీ నిర్వహించిన కొందరు రైతులు.. ఎర్రకోటలోకి ప్రవేశించారు. అక్కడ జాతీయ జెండా ఎగరవేసే స్తంభానికి వేర్వేరు రైతు సంఘాల జెండాలు కట్టారు. నిరసల్లో రైతులను అదుపు చేయడానికి బాష్పవాయువును ప్రయోగించడం సహా లాఠీ ఛార్జ్​ చేశారు పోలీసులు. పలు చోట్ల ఆందోళనకారులు పోలీసులపై కూడా దాడులకు పాల్పడ్డారు. అయితే,పోలీసుల కాల్పుల్లో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.