రేపు చెన్నైకి చిన్నమ్మ..అన్నాడీఎంకేలో టెన్షన్

రేపు చెన్నైకి చిన్నమ్మ..అన్నాడీఎంకేలో టెన్షన్

Sasikala ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష ముగించుకుని ఇటీవల విడుదలైన ఏఐఏడీఎంకే బహిష్కృత నాయకురాలు, జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ సోమవారం(ఫిబ్రవరి-8,2021) చెన్నైలో అడుగుపెట్టనున్నారు. నాలుగేళ్లు బెంగళూరులో జైలు శిక్ష అనుభవించిన శశికళ ఇటీవలే విడుదలయ్యారు. కాగా, కరోనా సోకడంతో చికిత్స పొంది కోలుకున్న శశికళ కొన్ని రోజులుగా ఐసొలేషన్‌లో ఉన్నారు. ఆ గడువు కూడా ముగియనుండటంతో సోమవారం ఆమె తమిళనాడుకు చేరుకుంటారని సన్నిహిత వర్గాలు తెలిపాయి.చెన్నై టీ నగర్‌లోని బంధువుల ఇంటికి శశికళ వెళ్తారని సమాచారం.

ఇక,శశికళ తమిళనాడులోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె వర్గం ఏర్పాట్లు చేస్తోంది. శశికళ అభిమానులు చెన్నై నగరంలో, ప్రముఖంగా టీ నగర్‌లో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. శశికళ, జయలలితోపాటు అన్నాడీఎంకే నేతల ఫొటోలతో కూడిన పోస్టర్లు, బ్యానర్లు నెలకొల్పారు. తిరువత్తియూరులో శశికళకు 35 అడుగుల భారీ కటౌట్‌ను ఆమె అనుచరులు ఇప్పటికే ఏర్పాటు చేశారు.

ఇక, చిన్నమ్మ తమిళనాడులో అడుగుపెట్టబోతుండటం తమిళ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో శశికళ మళ్లీ చెన్నైలో అడుగుపెట్టడం ఆ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పుతాయని అంచనా వేస్తున్నారు. శశికళ చెన్నైకి వస్తుండటంతో ఆమె వర్గం తమిళనాడులో అల్లర్లకు, హింసాత్మక చర్యలకు పాల్పడాలని భావిస్తోందని అన్నాడీఎంకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు,శశికళ ఎంట్రీతో పార్టీలో చీలికలు తప్పవని కలవరపడుతోన్న అధిష్టానం.. సొంత పార్టీ నేతలకు కూడా కీలక హెచ్చరిక చేసింది. శశికళ చెన్నైకి వస్తున్న నేపథ్యంలో ఆమెను కలిసేందుకు అన్నాడీఎంకే నేతలు ఎవరు వెళ్లినా ఉపేక్షించేంది లేదని,పార్టీ నుంచి బహిష్కరిస్తామని అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేసింది. పళని స్వామి, పన్నీరు సెల్వం అధ్యక్షతన జరిగిన అన్నాడీఎంకే కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే, అన్నాడీఎంకే పార్టీలోని సగం మంది ఎమ్మెల్యేలు, నేతలు చిన్నమ్మ శశికళకు మద్దతిస్తున్నట్లు సమాచారం. పళనిస్వామి కేబినెట్‌లో, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కొందరు శశికళ అనుచరులున్నారు. మరోవైపు శశికళ కారుకు అన్నాడీఎంకే పార్టీ జెండా ఉన్నది. ఇక పార్టీ సింబర్‌ రెండాకుల గుర్తు కోసం ఈ రెండు పక్షాలు పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికార అన్నాడీఎంకేలో చీలక తప్పదని కొందరు భావిస్తున్నారు. శశికళ పొలిటికల్ రీఎంట్రీతో అన్నాడీఎంకేకు కొత్త తలనొప్పులు తప్పేలా లేవు.