సెమీ హై స్పీడ్ రైలు : సికింద్రాబాద్ టు నాగ్ పూర్..దూరం తగ్గనుంది

  • Edited By: madhu , November 20, 2019 / 01:44 AM IST
సెమీ హై స్పీడ్ రైలు : సికింద్రాబాద్ టు నాగ్ పూర్..దూరం తగ్గనుంది

సెమీ హై స్పీడ్ రైలు త్వరలోనే పట్టాలెక్కబోతోంది. సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్‌కు కేవలం మూడు గంటల్లో చేరుకోవచ్చు. 200 కిలో మీటర్ల వేగంతో పరుగులు తీయనుంది. ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణానికి సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి. రష్యన్ రైల్వేస్ భాగస్వామ్యంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు నిర్మాణం, సాధ్య సాధ్యాలపై ఆ దేశ రైల్వే అధికారులు, టెక్నికల్ నిపుణుల బృందం భారతీయ రైల్వే బోర్డుకు ఇటీవలే ఓ నివేదికను అందచేసింది. దీనిపై రష్యన్ అధికారుల బృందం మూడు దఫాలుగా అధ్యయనం చేసింది. రెండేళ్ల క్రితం కేంద్ర బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టును ఆమోదించిన సంగతి తెలిసిందే. 

ప్రాజెక్టు నిర్మాణ ఖర్చును రష్యన్ రైల్వేస్, భారతీయ రైల్వే 50 : 50 చొప్పున భరించేలా ఒప్పదం చేసుకుంది. ట్రాక్ సామర్థ్యం పెంపు, వంతెనలు, ట్రైన్ నిర్మాణం తదితర అంశాలపై సమర్పించిన తుది నివేదికను ప్రస్తుతం రైల్వే బోర్డు పరిశీలిస్తోంది. సికింద్రాబాద్ – నాగ్ పూర్ మార్గాన్ని రెండు దశల్లో పూర్తి చేస్తారు. నాగ్ పూర్ నుంచి బల్లార్ష వరకు, బల్లార్ష నుంచి సికింద్రాబాద్ వరకు ఈ ప్రాజెక్టు చేపడుతారు. ఈ మార్గంలో 1770 బ్రిడ్జీలు, కల్వర్టులున్నట్లు రష్యన్ అధికారులు అంచనా వేసింది. సెమీ హై స్పీడ్ రైలు వేగాన్ని తట్టుకొనే విధంగా వంతెనల సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుందని అంచాన వేశారు. సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్‌కు రాకపోకలు సాగిస్తున్న రాజధాని ఎక్స్ ప్రెస్‌కు గంటకు 120 కి.మీటర్ల వేగంతో ప్రయాణిస్తూ..7.50 గంటల వ్యవధిలో గమ్యం చేరుతోంది. సెమీ హై స్పీడ్ కారిడార్ ఏర్పాటైతే ప్రయాణీకుల అత్యధిక వేగంతో కూడిన రైల్వే సదుపాయం అందుబాటులోకి వస్తుంది. 

ప్రత్యేకతలు : 
> గంటకు వేగం 200 కి.మీటర్లు
> 3 గంటల ప్రయాణం
> సికింద్రాబాద్ – నాగ్ పూర్ మధ్య దూరం 577 కి.మీటర్లు
> ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 3 వేల కోట్లు (అంచనా)
> నిర్మాణ లక్ష్యం : ఐదేళ్లు
Read More : కమల్‌హాసన్‌తో కలిసి పనిచేస్తానన్న రజినీకాంత్