నా ఉద్దేశ్యం అది కాదు: FREE KASHMIR ప్లకార్డు వెనుక కథ ఇదే

నా ఉద్దేశ్యం అది కాదు: FREE KASHMIR ప్లకార్డు వెనుక కథ ఇదే

JNUలో విద్యార్థులపై జరిగిన దాడి పట్ల పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్న సమయంలో ఫ్రీ కశ్మీర్ అంటూ ఓ యువతి ప్లకార్డుతో దర్శనమిచ్చింది. ఈ ఘటనకు దాంతో ముడిపెట్టిన యువతిని సోషల్ మీడియా ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. బీజేపీ ఆమెపై విమర్శల దాడి చేసింది.. దీంతో ఆమే స్వయంగా ఫేస్ బుక్ వీడియో ద్వారా స్పందించింది. మెహక్ మీర్జా ప్రభు అనే యువతి సోమవారం ఫ్రీ కశ్మీర్ పోస్టర్‌ను తాను ప్రదర్శించడం వెనక ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చింది. 

నిరసనలు జరిగే చోట వివిధ అంశాలకు సంబంధించి ఫ్లకార్డులు తయారు చేస్తున్నారని ఇందులో CAA, NRC, JNU, FREE KASHMIR స్లోగన్లు కలిగి ఉన్న ఫ్లకార్డులు ఉన్నాయని తెలిపింది. అందులో ఒకటి ఫ్రీ కశ్మీర్ ఫ్లకార్డు తీసుకున్నట్లు చెప్పిన మీర్జా…. కశ్మీర్‌లో ఇంటర్నెట్‌, మొబైల్ సేవలను తిరిగి పునరుద్ధరించాలని మాత్రమే తాను కోరినట్లు మీర్జా చెప్పింది. అంతేకాదు తను కశ్మీర్‌కు చెందిన యువతిని కూడా కాదని స్పష్టం చేసింది. 

ముంబైకి చెందిన అమ్మాయినని మరాఠీలో మాట్లాడుతూ వివరణ ఇచ్చింది. తనపై తప్పుగా వస్తున్న వార్తలను ఆమె ఖండించింది. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం తనకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందనే భయాన్ని మీర్జా వ్యక్తం చేసింది. ఒక అమ్మాయి భయంతో బతకాలా అంటూ ప్రశ్నించింది. ఈ వీడియోను నెటిజెన్లు షేర్ చేయాలంటూ విజ్ఞప్తి చేసింది మీర్జా. 

అందరూ చేస్తున్నట్లుగానే కశ్మీర్‌లో ఇంటర్నెట్, మొబైల్ సేవలను పునరుద్ధరించాలని తానూ కోరుతున్నట్లు చెప్పింది మీర్జా. ప్రాథమిక రాజ్యాంగ హక్కులపైనే తాను ప్రశ్నించినట్లు చెప్పింది మీర్జా. ప్రదర్శించడం వెనక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. ఈ ఫ్లకార్డు ప్రదర్శన వల్ల ఎవరైనా బాధపడితే తనను క్షమించాల్సిందిగా కోరింది. మానవుల పట్ల జాలి దయ చూపాలని విజ్ఞప్తి చేసింది. ద్వేషంపై ప్రేమ విజయం సాధించాలనే కోరికను వీడియోలో తెలియజేసింది.