Hair Danda : తల వెంట్రుకల దందా.. మయన్మార్ లో తీగ లాగితే నగరంలో డొంక కదిలింది

దందాకు కాదేది అనర్హం. ఆఖరికి తలవెంట్రుకల ఎగుమతిలోనూ అవకతవకలు జరిగాయి. తలవెంట్రుకల దందాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

Hair Danda : తల వెంట్రుకల దందా.. మయన్మార్ లో తీగ లాగితే నగరంలో డొంక కదిలింది

Hair Danda

Hair Danda : దందాకు కాదేది అనర్హం. ఆఖరికి తలవెంట్రుకల ఎగుమతిలోనూ అవకతవకలు జరిగాయి. తలవెంట్రుకల దందాపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 9 చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. రెండో రోజు 8 ప్రాంతాల్లో సోదాలు చేసింది. హైదరాబాద్‌, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని చార్టెడ్‌ అకౌంటెంట్ల ఇళ్లలో తనిఖీలు చేశారు. 2 కోట్ల 90 లక్షలు సీజ్‌ చేశారు. 12 సెల్‌ఫోన్స్‌, మూడు ల్యాప్ ట్యాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

విదేశాల్లో దక్షిణాది రాష్ట్రాల వారి తల వెంట్రుకలకు ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఓ మూడు కంపెనీలు స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్టు ఈడీ గుర్తించింది.. హెయిర్ సెలూన్ల నుంచి సేకరించిన వెంట్రుకలను గోదాంకు తరలిస్తున్నట్టు ఈడీ తెలుసుకుంది.

ఈ గోదాం అడ్రస్‌లతో నకిలీ వే బిల్లులు సృష్టించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్టు గుర్తించారు.. అసలు ఇంకా ఇలాంటి కంపెనీలు ఎన్ని ఉన్నాయి? ఈ దందా ఎంత కాలంగా కొనసాగుతోంది? అన్న అంశాలపై ఈడీ దృష్టి సారించింది.. చైనా, మియన్మార్‌, బంగ్లాదేశ్‌లతో పాటు ఇంకా ఏఏ దేశాలకు తలవెంట్రుకలను ఎగుమతి చేస్తున్నారని ఈడీ ఆరా తీస్తోంది..

ఈ జుట్టు వ్యాపారం వెనక చైనా ఉన్నట్టు తెలుస్తోంది.. మయన్మార్ సరిహద్దుల్లో ఈ జుట్టు తీగ లాగితే హైదరాబాద్‌లో డొంక కదిలింది. చైనాలోని తల వెంట్రుకల్ని ఖరీదు చేసే సంస్థలు కూడా హైదరాబాద్‌లో ఉన్న తమ ఏజెంట్లకు హవాలా ద్వారా చెల్లిస్తున్నారు.. ముఖ్యంగా బంగారం రూపంలోనో లేదా కొత్త పేమెంట్‌ యాప్‌ల రూపంలో చెల్లింపులు జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు.

గతంలో ఎల్బీ నగర్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు జుట్టు వ్యాపారులకు ఓ యాప్‌ ద్వారా 20 కోట్ల రూపాయలు చేరినట్టు అధికారులు గుర్తించారు.. ఈ వ్యవహారం మొత్తంపై ఆరా తీసిన నిఘా సంస్థలు మయన్మార్‌ సరిహద్దుల్లో ఈ ఏడాది 53 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.