Supreme court : CECగా అరుణ్‌ గోయల్‌ నియామకం.. ఏ ప్రాతిపదికన నియమించారో తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

CECగా అరుణ్‌ గోయల్‌ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నియామకంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఏ ప్రాతిపదికన నియమించారో తెలపాలంటూ..దానికి సంబంధించిన ఫైళ్లను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme court : CECగా అరుణ్‌ గోయల్‌ నియామకం.. ఏ ప్రాతిపదికన నియమించారో తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం

Supreme Court asks Centre to produce files related to appointment of EC Arun Goel

Supreme court CEC Arun Goel : కేంద్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా పనిచేయాలని..ప్రధానిపైనా చర్యలు తీసుకునేంత సమర్థతగా ఉండాలని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని..ఇందుకు మంత్రిమండలిని మించిన స్వతంత్ర వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకం గురించి కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైళ్లను.. మెరుపువేగంతో ఆమోదించడంపై సుప్రీం ధర్మాసనం పెదవి విరిచింది. 24 గంటలైనా గడవకముందే.. మొత్తం నియామక ప్రక్రియ ఎలా పూర్తి చేశారని రాజ్యాంగ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అంత వేగంగా.. అరుణ్ గోయల్‌ని ఎలా నియమించారో తెలపాలని కేంద్రాన్ని కోరింది. అరుణ్ గోయల్ ను నియామక ఫైళ్లను సమర్పించాలని కేంద్రానికి ఆదేశించింది. కాగా..అరుణ్ గోయల్ ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్నారు. గత శుక్రవారం (నవంబర్ 18,2022) వీఆర్ఎస్ తీసుకున్న తర్వాతి రోజే.. సీఈసీగా నియమిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గోయల్ నియాకమానికి సంబంధించిన ఫైళ్లను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

ఈ సోమవారం (నవంబర్21,2022) నుంచే ఆయన విధులు నిర్వహించడం మొదలుపెట్టారు. దీంతో.. ఎలాంటి ప్రక్రియ అనుసరిస్తున్నారో.. ఏ రూల్స్ పాటిస్తున్నారో.. ఎవరికీ అర్థం కావడం లేదు. నిజానికి.. వాలంటరీ రిటైర్మెంట్‌కు 3 నెలల ముందు నోటీసు ఇవ్వాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, తటస్థంగా ఉండాలన్న సుప్రీం వ్యాఖ్యలతో.. రాజకీయ వర్గాల్లోనూ కొత్త చర్చ మొదలైంది. కొన్ని సమయాల్లో ఎలక్షన్ కమిషన్.. పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని ప్రతిపక్ష పార్టీల తెలిపాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఎన్నికల సంఘం మాత్రమే కాదు.. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరు కూడా వివాదాస్పదంగా మారింది. ఏలిన వారి జేబు సంస్థల్లా.. వాటి పని తీరు ఉందన్న ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయ్. గతంలోనూ కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరుపై ఆరోపణలు ఉన్నప్పటికీ.. ఇప్పుడు వాటి ప్రతిష్ఠ మరింత మసకబారింది. ఎమర్జెన్సీ కాలంలోనూ.. రాజకీయ ప్రత్యర్థులను ఈ విధంగా వేధించిన దాఖలాలు లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.పారదర్శకంగా దర్యాప్తు చేసి.. వాస్తవాలను వెలికితీసి.. తప్పు చేసిన వారికి.. తగిన శిక్ష పడేలా చేయాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ఇప్పుడు కేవలం.. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయాయనే వాదన వినిపిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, వారిని రాజకీయంగా యాక్టివ్‌గా ఉండకుండా చేయడానికి.. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీటిని రాజకీయ విమర్శలని కొట్టి పారేయడానికి వీల్లేని విధంగా.. అవి వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ విమర్శలకు.. అధికార పార్టీకి చెందిన నేతలు కొందరు ఇస్తున్న సమాధానాలు కూడా.. ఉద్దేశపూర్వకంగానే.. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా వేధిస్తున్నారనే ఆరోపణలకు బలం చేకూర్చేవిగా ఉంటున్నాయ్.

Supreme court : దర్యాప్తు సంస్థలు స్వతంత్ర వ్యవస్థలా.? ప్రభుత్వాల చేతుల్లో కీలుబొమ్మలా? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఎన్డీయే హయాంలోనే కాదు.. యూపీఏ హయాంలోనూ.. దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్థులను వేధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు వారు చేసిన దానికి.. ఇప్పుడు తాము బదులు తీర్చుకుంటున్నామన్నట్లుగా.. కొందరు నేతలు, కీలక పదవుల్లో ఉన్న నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఉంటున్నాయ్. మొత్తం మీద.. రాజకీయంగా లెక్కలు సరిచేసేందుకు.. దర్యాప్తు సంస్థలను కేంద్రం వినియోగించుకుంటోందన్న విషయం.. ఇలాంటి కామెంట్లు స్పష్టం చేస్తున్నాయ్. అయితే.. పార్టీలకు ప్రజలు పట్టం కట్టేది.. ప్రభుత్వంలో ఉండి మంచి పాలన అందించడానికే తప్ప.. రాజకీయంగా ప్రత్యర్థులపై కక్ష తీర్చుకునేందుకు కాదు. గత ప్రభుత్వాల హయాంలో జరిగిన అవకతవకలు, తప్పిదాలు, పొరపాట్లు జరగకుండా ప్రజారంజక పాలన అందిస్తారనే నమ్మకంతోనే.. కొత్త పార్టీ నేతలను అధికారపీఠంపై కూర్చోబెడతారు. కానీ.. అందుకు భిన్నంగా అధికార పార్టీలు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిస్తున్నాయ్. అప్పుడు.. వాళ్లు చేశారు గనక.. ఇప్పుడు మేమూ చేస్తామన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

గవర్నర్ల నియామకం దగ్గర్నుంచి.. ప్రత్యర్థులపై కేసుల బనాయింపు దాకా అన్ని విషయాల్లోనూ దర్యాప్తు సంస్థలు, రాజ్యాంగ వ్యవస్థలను.. ఎలా వాడుతున్నారనే విషయం తెలుస్తూనే ఉంది. తమకు వ్యతిరేకంగా మాట్లాడినా.. విమర్శల డోస్ పెంచినా.. రాజకీయంగా ఏమాత్రం తేడా వచ్చినా.. ముందుగా ఐటీ దాడులు, తర్వాత ఈడీ రైడ్స్.. ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయ్. ఇంకా.. వాళ్లపై పాత కేసులేమైనా ఉంటే.. సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలతో.. వాటిని తిరగదోడుతామని హెచ్చరించడం, అయినా లొంగకపోతే.. సీబీఐని సీన్‌లోకి దించడం లాంటి ఘటనలు గడిచిన కొన్నేళ్లలోనే ఎన్నో చూసింది ఈ దేశం. యూపీఏ హయాంలో దర్యాప్తు సంస్థలు.. అప్పటి అధికార కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతలనూ విచారించాయి. ఆరోపణలపై ఆధారాలున్నాయని తేలితే.. వారిని అరెస్టు చేయడానికీ వెనుకాడలేదు. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. దర్యాప్తు సంస్థలు పూర్తిగా కేంద్రం చేతిలో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయ్. తప్పు చేసిన వారిపై రెయిడ్స్ జరిగితే అందులో తప్పేమీ లేదు.. కానీ.. కేంద్రానికి వ్యతిరేకంగా గళమెత్తిన పార్టీలు అధికారంలో ఉన్న చోట్లే పనిగట్టుకుని దాడులు చేస్తుండడమే వివాదానికి కారణం అవుతోంది. అప్పట్లో బెంగాల్‌, ఆ తర్వాత తమిళనాడు, ఇప్పుడు తెలంగాణ.. ఎక్కడ చూసినా.. పొలిటికల్‌ ఇష్యూలే పైకి కనిపిస్తుండడం దర్యాప్తు సంస్థల తీరుపై విమర్శలు పెంచుతోంది.

ప్రస్తుతం.. దేశంలో అధికార పార్టీ వ్యతిరేక నేతలపై మాత్రమే దాడులు జరుగుతున్నాయ్. వారిని మాత్రమే వేధిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఏదేమైనా.. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు.. దుర్వినియోగానికి గురవుతున్నాయనే విధంగా ఆ సంస్థల పనితీరు ఉంటోంది. రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా స్వతంత్ర సంస్థల ప్రతిష్టను.. ప్రభుత్వాలు మసకబారేలా చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. దర్యాప్తు పేరుతో.. ప్రత్యర్థి పార్టీల నాయకులను వేధించడం దివాళాకోరు రాజకీయాలకు పరాకాష్ఠ అని చెబుతున్నారు.

నిజానికి.. కేంద్ర దర్యాప్తు సంస్థలు.. ప్రభుత్వంలోని పెద్దలు చెబితేనో.. వాళ్లు ఆదేశిస్తేనో.. పనిచేయాల్సిన అవసరం లేదు. వాళ్లకున్న ఇంటలిజెన్స్ సమాచారం మేరకు.. వాళ్లకున్న నిఘా, అనుమానాల మేరకు.. ఎవరిపై దాడులు చేయాలి? ఎవరి లెక్కలు తేల్చాలి? ఎవరిని కటకటాల వెనక్కి పంపాలనేది.. పూర్తిగా వారి స్వేచ్ఛ. దర్యాప్తు విషయంలో ఆ సంస్థలన్ని.. స్వతంత్రంగా పనిచేయాల్సి ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్న.. ప్రభుత్వంలో ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా.. చట్టం తన పని తాను చేసుకుపోవాలి. తప్పు చేసిన వాళ్లకు తగిన శిక్ష పడి తీరాలి. కానీ.. దేశంలో ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. ఎవరో చెబితేనే రైడ్స్‌కి వచ్చినట్లు.. దర్యాప్తు పేరుతో, విచారణ పేరుతో.. తిప్పి.. తిప్పి.. వేధింపులకు గురిచేయడం లాంటివన్నీ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయ్. ఇదిలాగే కొనసాగితే.. దర్యాప్తు సంస్థలకు ఉన్న విలువ, ప్రతిష్ఠ మొత్తం దిగజారిపోతాయ్. రాజ్యాంగ వ్యవస్థ మీదే నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది.