అమ్మ గుడిలో మోడీ, అమిత్ షా ఫోటోలు

అమ్మ గుడిలో మోడీ, అమిత్ షా ఫోటోలు

Tamil Nadu Assembly Elections 2021 Modi Photo In Jayalalitha

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి అమ్మ.. జయలలిత స్మారకార్థం తమిళనాడులో నిర్మించిన గుడిలో ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఫోటోలు దర్శనమిచ్చాయి. తమిళనాడులో ఎవరినైనా ఎక్కువగా అభిమానిస్తే వారికి గుడులు కట్టేస్తారు ప్రజలు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జయలలితకు గుడి కట్టారు అక్కడి ప్రజలు.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ పార్టీ అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేస్తుండగా.. ఆ గుడిలో ఇప్పుడు నరేంద్రమోడీ, అమిత్‌షా ఫోటోలను పెట్టారు.

గుడిని చూడడానికి వచ్చేవారిని ప్రభావితం చేసేందుకు బీజేపీ నేతల ఫోటోలను పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ రాష్ట్రానికి జయలలిత చేసిన సేవలను, ఆమె త్యాగానికి గుర్తుగా గుడిని నిర్మించగా.. ప్రధాని మోడీ నాయకత్వంలో తమిళనాడుకు ఎన్నో ప్రాజెక్టులు లభించినట్లు అన్నాడీఎంకే పార్టీ చెబుతోంది. అందుకే వీరి ఫోటోలను ఈ స్మారక మందిరంలో పెట్టామని అంటున్నారు. గత జనవరిలో అన్నాడీఎంకేకు చెందిన మంత్రి ఆధ్వర్యంలో గుడిని నిర్మించారు. తిరుమంగళంలోని 12 ఎకరాల సువిశాల స్థలంలో గుడిని నిర్మించారు.

‘అమ్మ’ పేరిట పేదలకు ఉచిత రేషన్, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ వంటి పలు చర్యలు అక్కడి ప్రభుత్వం చేస్తుండగా.. అమ్మ ఫోటోలను ఏర్పాటు చేసి గుడి కట్టిన చోట బీజేపీ నేతల ఫోటోలను పెట్టడంపై రాష్ట్రంలోని విపక్షాలు.. కొందరు అమ్మ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గుడిలో జయలలితతో పాటు ఎం.జి.రామచంద్రన్ విగ్రహాలు కూడా ఉన్నాయి.