బీజేపీకి వైట్ వాష్ తప్పదు..తేజస్వీ యాదవ్

  • Edited By: veegamteam , January 14, 2019 / 06:25 AM IST
బీజేపీకి వైట్ వాష్ తప్పదు..తేజస్వీ యాదవ్

  ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్రాల్లో బీజేపీకి వైట్ వాష్ తప్పదని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ పొత్తు ప్రకటన తర్వాత ఆదివారం(జనవరి-13) బీఎస్పీ అధినేత్రి మాయావతితో తేజస్వీ సమావేశమయ్యారు. మాయావతితో సమావేశం తర్వాత తేజస్వీ మాట్లాడుతూ..బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని తుడిచిపెట్టాలని, నాగ్ పూర్ చట్టాలను అమలు చేయాలని బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్న వాతావరణం నేడు నెలకొందని అన్నారు.

అఖిలేష్, మాయావతిల నిర్ణయాన్ని ప్రజలు గౌరవిస్తున్నారని, యూపీ, బీహార్ లో బీజేపీకి వైట్ వాష్ తప్పదని, యూపీలో అయితే బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదని తేజస్వీ అన్నారు. యూపీలో ఎస్పీ-బీఎస్పీ కూటమి అన్ని స్థానాల్లో ఘనవిజయం సాధిస్తుందని చెప్పారు. బీజేపీని ఓడించడానికి బీహార్ స్టైల్ లో ప్రాంతీయ పార్టీల కూటమి ఉండాలని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ ఎప్పుడూ చెబుతుంటారని తేజస్వీ తెలిపారు. 2015లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు మహాకూటమిగా ఏర్పడి బీజేపీని ఓడించాయి. అయితే ఆతర్వాత జరిగిన కొన్ని పరిణామాల కారణంగా నితిష్ కుమార్ తిరిగి బీజేపీతో చేతులు కలిపి సీఎంగా కొనసాగుతున్నారు.