పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్‌ సర్కార్‌..బల నిరూపణలో విఫలమైన నారాయణస్వామి

పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్‌ సర్కార్‌..బల నిరూపణలో విఫలమైన నారాయణస్వామి

Congress government collapsed in Puducherry : అంతా ఊహించిందే జరిగింది. పుదుచ్చేరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కుప్పకూలింది. బలనిరూపణలో నారాయణస్వామి సర్కార్‌ విఫలం అయ్యింది. దీంతో రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కు సీఎం నారాయణస్వామి బయల్దేరారు. ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, మరో ఎమ్మెల్యే ఉద్వాసనకు గురవడంతో ప్రభుత్వం అసెంబ్లీలో ఇవాళ బలాన్ని నిరూపించుకోవాలసి వచ్చింది. బల నిరూపణ సమయంలో నారాయణస్వామి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్లపై విమర్శలు గుప్పించారు. పరిపాలనలో జోక్యం చేసుకున్నారని ఆరోపించారు. తమపై కుట్ర చేశారని మండిపడ్డారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి నారాయణస్వామి చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. 33 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రభుత్వ బలం 12 కు పడిపోయింది. బలపరీక్ష నిర్వహించడానికి ఒక్కరోజు ముందు మరో ఇద్దరు వైదొలగడంతో.. ఇక 12 స్థానాలకే పరిమితమైంది. ఎమ్మెల్యేలను బుజ్జగించడానికి నారాయణ స్వామి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 26 మంది సభ్యుల బలం ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీలో కాంగ్రెస్-డీఎంకే కూటమికి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

మరోవైపు గవర్నర్ తమిళిసై సైతం..తనదైన మార్కుతో దూకుడు ప్రదర్శించారు. లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వాన్ని బలపరీక్షకు ఆదేశించారు. దీని వెనుక కూడా రాజకీయ కారణాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏదీ ఏమైనా బీజేపీ వ్యూహం మాత్రం వర్కౌట్ అయింది.

పుదుచ్చేరి ప్రభుత్వం కుప్పకూలింది. మరి వాట్ నెక్ట్స్ అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వ్యవహారంలో గవర్నర్‌ తదుపరి చర్యలు ఏంటని అందరూ ఎదురుచూస్తున్నారు. ఆప్షన్‌ వన్‌ బీజేపీ కూటమి బలం నిరూపించుకునేలా అవకాశం ఇవ్వడం, ఆప్షన్ టూ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చెయ్యడం, చివరిగా అసెంబ్లీని రద్దు చేయడం… ఇప్పుడు గవర్నర్‌ ముందున్న ఆప్షన్స్ ఇవి. మరి చూడాలి పుదుచ్చేరి రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.