Blue Flag: మరో రెండు భారతీయ బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ ట్యాగ్‌!

అంతర్జాతీయ పర్యావరణ స్థాయి ట్యాగ్, రెండు బీచ్‌లకు రావడంతో దేశంలో మొత్తం బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల సంఖ్య 10కి చేరుకుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Blue Flag: మరో రెండు భారతీయ బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ ట్యాగ్‌!

Beach

Two Beaches: భారతదేశంలోని మరో రెండు బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ లభించింది. లేటెస్ట్‌గా అంతర్జాతీయ పర్యావరణ స్థాయి ట్యాగ్, రెండు బీచ్‌లకు రావడంతో దేశంలో మొత్తం బీచ్‌ల సంఖ్య 10కి చేరుకుందని పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ధృవీకరణ పొందడానికి రెండు బీచ్‌లు తమిళనాడులోని “కోవలం” మరియు పుదుచ్చేరిలోని “ఈడెన్” బీచ్‌లకు బ్లూ ట్యాగ్ లభించినట్లుగా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పర్యావరణ లేబుల్-బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను అందిస్తుంది ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ (FEE). ఇప్పటికే అంతర్జాతీయ ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ పొందిన బీచ్ల జాబితాలో శివరాజ్పూర్ (ద్వారక-గుజరాత్), ఘోఘ్లా (డయ్యూ), కసర్కోడ్, పాడుబిద్రి(కర్ణాటక), కప్పడ్ (కేరళ), రుషికొండ (ఆంధ్ర ప్రదేశ్), గోల్డెన్ బీచ్ (పూరి-ఒడిశా), రాధానగర్ (అండమాన్ నికోబార్ దీవులు) ఉన్నాయి. ఈ ఎనిమిది బీచ్‌లు గత ఏడాది అక్టోబర్ 6న బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందాయి.

పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని క్లీన్ అండ్ గ్రీన్ ఇండియా దిశగా భారతదేశ ప్రయాణం చేస్తుందని ఈ క్రమంలోనే మరో మైలురాయి అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. ‘భారతదేశంలో 10 అంతర్జాతీయ బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు ఉండగా.. ఈ ఏడాది కోవలం మరియు ఈడెన్ బీచ్‌లు అందులో చేర్చబడ్డాయి. 2020లో ట్యాగ్ పొందిన 8 బీచ్‌లకు రిసెర్టిఫికేషన్ లభించింది.

బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఎందుకు పొందాలి?
బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎకో-లేబుల్. ఇది నాలుగు ప్రధాన విభాగాలలో 33 కఠినమైన ప్రమాణాల ఆధారంగా ఇవ్వబడుతుంది. పర్యావరణ విద్య మరియు సమాచారం, స్నానపు నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ మరియు రక్షణ మరియు బీచ్ భద్రత మరియు సేవలు. బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది పర్యావరణ-పర్యాటక నమూనా, ఇది పర్యాటకులకు/బీచ్‌కి వెళ్లేవారికి పరిశుభ్రమైన స్నానపు నీరు, సౌకర్యాలు, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం మరియు ఈ ప్రాంతం స్థిరమైన అభివృద్ధిని అందించడానికి ప్రయత్నిస్తుంది.

ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలైన ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(IUCN), యూఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO), యూఎన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ (UNEP), ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్(FEE)లతో కూడిన అంతర్జాతీయ జ్యూరీ బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ సర్టిఫికేషన్ ఇస్తుంది.

‘బ్లూ ఫ్లాగ్’ అర్హత సాధించిన 50 దేశాల్లో భారత్ ఇప్పుడు ఒకటిగా నిలిచింది. దేశంలోని 100 బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే బీచ్‌ల అభివృద్ధికి కృషి చేస్తుంది. తీరప్రాంతాలలో కాలుష్య నియంత్రణ కోసం కృషి చేసినందుకు “ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్” విభాగంలో భారతదేశానికి బహుమతులు కూడా లభించాయి.