ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి స్వేచ్ఛను హరించే హక్కు, అధికారాలు ఎవ్వరికీ లేదు : హైకోర్టు కీలక తీర్పు

ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి స్వేచ్ఛను హరించే హక్కు, అధికారాలు ఎవ్వరికీ లేదు : హైకోర్టు కీలక తీర్పు

UP : Nobody can interfere in life of two adults : మతాంతర వివాహాలపై (లవ్ జీహాద్) నిషేధిస్తూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో అలహాబాద్‌ హైకోర్టు ఓ కేసు తీర్పు విషయంలో కీలక తీర్పును వెలువరించింది. మేజర్లైన యువతీయువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటే వారికి జరిగిన వివాహాన్ని అడ్డుకునే హక్కు, అధికారలు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి స్వేచ్ఛను హరించే హక్కు, అధికారాలు ఎవ్వరినీ లేవనీ..ఆఖరికి వారిని కన్నవారికి కూడా లేవని అలహాబాద్ హైకోర్టు జస్టిస్‌ శ్రీవాస్తవతో కూడిన ఏకసభ్య ధర్మాసనం శనివారం (జనవరి 9,2021) తీర్పునిచ్చింది.

కాగా..లక్నోకు చెందిన ఇద్దరు యువతీ, యువకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరి మతాలు వేరు. 22 ఏళ్ల అమ్మాయి హిందువు, 23 ఏళ్ళ అబ్బాయి ముస్లిం. వారి మతాలు వేరుకావటంతో వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ఒక్కటవ్వాలనుకున్నారు. అలా 2020లో వివాహం చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మండిపడ్డారు. వారి వివాహం చెల్లదంటూ రాద్దాంతం చేశారు. పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరిని ఇరు కుటుంబాల పెద్దలు వేధించటం మొదలు పెట్టారు. వివాహాన్ని రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేశారు. దీంతో ఆ జంట హైకోర్టును ఆశ్రయించింది. తమ పెకు వ్యతిరేకంగా పెద్దలు ఒత్తిడి తెస్తున్నారని, తమకు రక్షణకు కల్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం బాధితులకు అండగా నిలిచింది. ఇరు కుటుంబాల సభ్యుల తీరును తీవ్రంగా మందలించింది. వారి ఆలోచన కోర్టు పరంగా తప్పు అని చెప్పింది. మేజర్లైన యువతీ, యువకులు స్వేచ్ఛను హరించే హక్కు వారికి లేదని తేల్చిచెప్పింది. అంతేకాదు..నూతన దంపతులకు కొన్ని రోజుల పాటు పోలీసు భద్రతను కల్పించాల్సిందిగా స్థానిక డీఎస్పీని హైకోర్టు ఆదేశించింది.

మరోవైపు కుటుంబ సభ్యులను వదులుకుని వచ్చిన వధువుకు ఆర్థికంగా భరోసా ఇవ్వాల్సిన బాధ్యత భర్తపై ఉందని, వెంటనే ఆమె పేరు మీద 3లక్షల రూపాయల నగదును జమచేయాలని పేర్కొంది. ఆ నగదుని బ్యాంకులో వేసి దానికి సంబంధించిన రసీదును కోర్టులో సమర్పించాలని ఆదేశించింది. ఈ కేసు విచారణకు వచ్చే ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.

కాగా.. మతాంతర వివాహాలను నిషేధిస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే మధ్యప్రదేశ్‌ సైతం ఇటువంటి చట్టాన్నే రూపొందించింది. వివాదాస్పదంగా మారిన ఈ చట్టాలపై దేశ వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఈ లవ్ జీహాద్ చట్టం ప్రకారం మతాంతర వివాహం చేసుకుంటే 10 సంవత్సరాల జైలు శిక్ష,రూ.25వేల జరిమానా కూడా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయం తెలిసిందే.