నందిగ్రామ్ లో మార్మోగిన జై శ్రీరామ్ నినాదాలు..మమతని వెంబడించి మరీ

వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది.

నందిగ్రామ్ లో మార్మోగిన జై శ్రీరామ్ నినాదాలు..మమతని వెంబడించి మరీ

Assembly Elections

W.B. Assembly elections వెస్ట్ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల పోలింగ్ నేటితో ముగినయనుండటంతో పార్టీల ప్రచారం హోరాహోరీ దశకు చేరుకుంది. సీఎం మమతా బెనర్జీ పోటీ చేస్తోన్న నందిగ్రామ్ నియోజకవర్గానికి రెండో విడతలోనే(ఏప్రిల్-1,2021)పోలింగ్ జరగనుంది. నందిగ్రామ్ నియోజకవర్గంలో మమతను ఓడించి సువేందును గెలిపించుకోవాలని భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్‌ షా పట్టుమీదున్నారు.

నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్న సీఎం మమతా బెనర్జీ..ప్రచారానికి చివరిరోజు కావడంతో మంగళవారం ఆ నియోజకవర్గంలో విస్తృతస్థాయిలో పర్యటించారు. ఇటీవల దీదీ కాలికి గాయం కాగా.. చక్రాల కుర్చీలోనే కూర్చొని ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇవాళ అదే నియోజకవర్గంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రోడ్‌ షోలో పాల్గొనే వేదికను దాటుకుంటూ మమత ముందుకెళ్లారు.

అయితే, అమిత్ షా రోడ్ షోకు సంబంధించిన వేదికను మమత దాటి వెళుతుండగా.. ఆమెను గమనించిన కొందరు బీజేపీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ నినాదాలతో హోరెత్తించారు. జై శ్రీరామ్ నినాదాలతో మమత రోడ్‌ షోను ఆటంకపరిచే ప్రయత్నం చేశారు. రోడ్ షో చేస్తున్న మమత బెనర్జీని కొంత దూరం వెంబడించి మరీ ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. అయితే మమతకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవల సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా.. కోల్ కతాలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోడీ సమక్షంలో మమత ప్రసంగిస్తుండగా..జై శ్రీరామ్ నినాదాలు మార్మోగిపోయాయి. దీంతో అసహనానికి గురైన మమత ప్రసంగించేందుకు నిరాకరించారు. ముఖ్యమంత్రిని అవమానపరిచేందుకే ఆ నినాదాలు చేసినట్లు అప్పట్లో టీఎంసీ ఆరోపించింది.

నందిగ్రామ్‌లో మమత ఓటమి ఖాయమని, ఆమె ఓటమితో ప్రజలు కోరుకుంటున్న మార్పు బెంగాల్‌లో మొదలవుతుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. నందిగ్రామ్‌లో మమతపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి రికార్డు మెజారిటీతో గెలుపొందుతారని షా విశ్వాసం వ్యక్తం చేశారు. నందిగ్రామ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ… నందిగ్రామ్‌లో ప్రజలు మార్పు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని మిమ్మల్ని చూస్తే అర్థమవుతోంది. మీ ఉత్సాహం చూస్తుంటే బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలుపు ఖాయమని స్పష్టంగా తెలుస్తుందని. నందిగ్రామ్‌కు చేరుకున్న తర్వాత ఒక విషాద వార్త తెలిసింది. ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఓ మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది. మమత ఎక్కడైతో ఉన్నారో అక్కడే ఆ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సీఎం మమత ఉన్న ప్రాంతంలోనే, ఆమె ఆ ప్రాంతం పర్యటిస్తుండగానే అక్కడ రేప్ జరిగిందంటే ఇక మహిళలకు భద్రత ఎక్కడుందని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. విచక్షణారహితంగా చేసిన దాడిలో బీజేపీ కార్యకర్త తల్లి తీవ్ర గాయాలపాలై.. నిన్న చనిపోయిందని.. మమత మాత్రం మహిళల భద్రత గురించి మాట్లాడతారని షా ఎద్దేవా చేశారు.

ఇదిలా ఉండగా, ఎనిమిది దశల్లో జరగనున్న బెంగాల్‌ పోలింగ్‌లో భాగంగా ఇప్పటికే మొదటి దశ పోలింగ్‌ ముగిసింది. ఏప్రిల్ ఒకటిన జరిగే రెండో దశలో ప్రజలు ఓట్లు వేయనున్నారు. అప్పుడే నందిగ్రామ్ భవితవ్యాన్ని తేల్చనున్నారు. మే-2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.