కళ్లద్దాలు పెట్టుకునే వారు జాగ్రత్త, కళ్ల జోడుపై 9రోజుల వరకు కరోనా వైరస్, ఇలా శుభ్రం చేసుకోండి

  • Published By: naveen ,Published On : August 31, 2020 / 11:42 AM IST
కళ్లద్దాలు పెట్టుకునే వారు జాగ్రత్త, కళ్ల జోడుపై 9రోజుల వరకు కరోనా వైరస్, ఇలా శుభ్రం చేసుకోండి

వస్తువులు, బట్టలపై కరోనా వైరస్ కొన్ని గంటల పాటు బతికే ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు తెలిపారు. అయితే తాజాగా కళ్లద్దాలపైనా కరోనా వైరస్ రోజుల పాటు జీవించే ఉంటుందని కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కళ్ల అద్దాలపై కరోనా వైరస్ 9 రోజుల పాటు ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో కళ్లజోడు వాడేవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లి వచ్చినప్పుడు (మరీ ముఖ్యంగా ఆసుపత్రి, ఫార్మసీ) కళ్ల జోడుని కచ్చితంగా శుభ్రం చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.



హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వాడితే మంచిది:
‘మాస్కులతో నోరు, ముక్కును కవర్‌ చేసుకున్నట్లుగానే కళ్లను కవర్‌ చేయడానికి అద్దాలు అంతే అవసరం. అయితే కళ్ల అద్దాలపై వైరస్‌ 9 రోజుల వరకు ఉంటుందని పరిశోధనల్లో తేలింది. అందుకే వాటిని తరచూ శుభ్రం చేసుకోవాలని హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రిలోని కంటి వైద్య నిపుణుడు అక్షయ్‌ తెలిపారు. అయితే కళ్ల జోడుని ఆల్కహాల్‌ శానిటైజర్లతో శుభ్రం చేయవద్దని, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వాడితే మంచిదని” ఆయన సూచించారు.

ఇప్పటికే కరోనా వైరస్ నుంచి రక్షించుకునేందుకు WHO కొన్ని సూచనలు చేసింది. వైరస్ ఎక్కడ, ఎంత సేపు బతుకుతుందో తెలిపింది. కరోనా వైరస్ వస్తువులపై మాత్రమే ఉంటుంది. వైరస్ అంటిన వస్తువులను ముట్టుకుని నోరు లేదా ముక్కు దగ్గర చెయ్యి పెడితేనే వైరస్ అంటుతుంది. వస్తువుల మీద ఉన్న వైరస్ బతికేది కేవలం 12 గంటలే. నీళ్లు, సబ్బుతో కడిగితే వైరస్ పోతుందని WHO ప్రతినిధులు తెలిపారు. బట్టలపై 9 గంటల పాటు వైరస్ బతుకుతుంది. రెండు గంటలు ఎండలో ఆ బట్టలను పెడితే వైరస్ చచ్చిపోతుందన్నారు.



కళ్ల అద్దాలను ఇలానే శుభ్రం చేసుకోవాలి:
* లైట్ డిష్ వాషర్ సోప్ తో ట్యాప్ నీటి కింద కళ్ల అద్దాలను కడగాలి
* మైక్రోఫైబర్ క్లాత్ తో కళ్లజోడుని శ్రుభం చేసుకోవాలి.
* బయటికి వెళ్లిన ప్రతిసారి హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రవం వెంట పెట్టుకోవాలి
* దాంతో కళ్ల జోడుని తరుచుగా శుభ్రం చేసుకోవాలి
* ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్లతో అస్సలు శుభ్రం చేయొద్దు, అవి లెన్స్ ను డ్యామేజ్ చేస్తాయి



ఫేస్ మాస్కులు రీ యూజబుల్. అంటే ఉతికేసి మళ్లీ వాడుకోవచ్చు. దీంతో వాటి ద్వారా ఇన్ ఫెక్షన్ శాతం తక్కువ. అయితే కళ్ల జోడు విషయంలో అలా కాదు. పదే పదే వాటిని వాడాల్సి ఉంటుంది. అందుకే కళ్ల జోడు విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవి వైరస్ ను మోసుకెళ్లే కారకాలుగా కాకుండా చూసుకోవాలి.

కళ్ల అద్దాల్లో ఏదైనా చీలిక వస్తే, అప్పుడు దానిపై ఉండే వైరస్ నేరుగా కళ్లలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. అందుకే కళ్ల అద్దాలను డిస్ ఇన్ఫెక్షన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మన చేతులను తరుచుగా ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుంటూ ఉంటామో, అలాగే కళ్ల అద్దాలను కూడా శుభ్రం చేసుకోవడం మంచిదన్నారు.



ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో ఏ విధంగా అయితే ముక్కు, నోరుని మూసి ఉంచేందుకు మాస్కులు కచ్చితంగా ధరిస్తామో.. అలానే కళ్లకు అద్దాలు పెట్టుకోవడం సేఫ్ అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే పదే పదే కళ్ల జోడుని చేతులతో టచ్ చేయొద్దని చెపపారు. చేతలతో అడ్జస్ట్ మెంట్ చేసుకునే పని లేకుండా ముందే జాగ్రత్తగా కళ్ల అద్దాలను పెట్టుకోవడం మంచిది. అలాగే కళ్ల జోడుని తీసి వేసే సమయంలో రెండు చేతులు వాడటం మంచిది అని చెప్పారు.