కేంద్రం ఆదేశాలు : పైలెట్ అభినందన్ వీడియోలు తొలగింపు

  • Published By: veegamteam ,Published On : February 28, 2019 / 05:09 PM IST
కేంద్రం ఆదేశాలు : పైలెట్ అభినందన్ వీడియోలు తొలగింపు

పాకిస్తాన్ చెరలో ఉన్న భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వీడియోలన్నిటిని యూట్యూబ్ తొలగించింది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో అభినందన్ వీడియోలను సైట్ నుంచి తొలగించింది. అభినందన్‌కు సంబంధించి పాకిస్తాన్ పలు వీడియోలను విడుదల చేసింది. అభినందన్ పై దాడి చేసే దృశ్యాలను.. తన పేరు, సర్వీస్ నెంబర్ చెప్పే వీడియో.. కళ్లకు గంతలు కట్టి, ముఖంపై రక్తం కారుతున్న వీడియోలను పాక్ రిలీజ్ చేసింది.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజల్లో ఆగ్రహావేశాలు మరింత పెరిగాయి. ఈ వీడియోలపై అభినందన్ తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సున్నితమైన అంశం అని ఆ వీడియోలు చూపించి మనోభావాలు దెబ్బతీయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. వీటిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. వెంటనే వాటిని తొలగించాలని యూట్యూబ్‌ను కోరింది. స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోలను తొలగించింది. భారత సైనిక బలగాలు సైతం అభినందన్ వీడియోలు షేర్ చేసుకోవద్దంటూ నెటిజన్లకు ఇదివరకే విజ్ఞప్తి చేశాయి. కాగా అంతర్జాతీయ స్థాయిలో భారత్ తీసుకొచ్చిన దౌత్యపరమైన ఒత్తిడితో పాక్ తలొగ్గింది. అభినందన్‌ను రేపు(మార్చి 1) విడుదల చేయనున్నట్టు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

జమ్మూ కశ్మీర్‌లోని సైనిక స్థావరాలపై దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ వైమానిక దళాన్ని తిప్పికొట్టే క్రమంలో భారత ఎయిర్ ఫోర్స్ కి చెందిన మిగ్21 యుద్ధవిమానం ఒకటి పాక్ భూభాగంలో కూలిపోయింది. పైలెట్ అభినందన్ ప్రాణాలను పణంగా పెట్టి పాక్ విమానాలను తరిమికొట్టారు. విమానం కూలిపోతున్న సమయంలో ఆయన పారాచ్యూట్ ద్వారా పాక్ భూభాగంలో ల్యాండ్ అయ్యారు. దీంతో కమాండర్ అభినందన్‌ను పాకిస్తాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది.
 
అభినందన్‌ను నిర్బంధంలోకి తీసుకున్న తర్వాత పాకిస్తాన్ అత్యుత్సాహం ప్రదర్శించింది. పలు వీడియోలు విడుదల చేసింది. అందులో అభినందన్ ను కొడుతున్న దృశ్యాలు ఉన్నాయి. భారత ఫ్లైట్ సూట్‌ ధరించిన ఓ వ్యక్తికి, కళ్లకు గంతలు కట్టి, ముఖంపై రక్తం కారుతున్న మరో వీడియో విడుదల చేసింది. ఓ వీడియోలో ఆయన తన పేరు, సర్వీస్ నంబర్‌ను చెబుతున్నట్టు కనిపిస్తుంది. ఆయనను ఇంటరాగేట్ చేసిన వీడియోని కూడా పాక్ రిలీజ్ చేసింది. ఈ వీడియోలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింతగా పెంచేలా చేశాయి.