Araku Coffee : అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికెట్ ..

గిరిజనుల సహకారంతో జీసీసీ మరో మైలురాయి అధిగమించింది. గిరిజన రైతులు పండిస్తున్న కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ లభించింది.

Araku Coffee : అరకు కాఫీకి ఆర్గానిక్ సర్టిఫికెట్ ..

Araku Coffee organic certificate

Araku Coffee organic certificate : చాలా మందికి ఉదయాన్నే ఓ కప్పు కాఫీ తాగనిదే.. వాళ్ల డే స్టార్ట్ అవదు. ఒక కమ్మని కాఫీ ఇచ్చే ఫీల్.. మనసుకు ఎంతో ఉల్లాసాన్నిస్తుంది. ఆ కమ్మని కాఫీ పేరు చెబితే వెంటనే గుర్తొచ్చేది మన అరకు కాఫీనే. ఇప్పుడు ఆ కాఫీకి.. మరో అరుదైన ఘనత దక్కింది. నాలుగేళ్లుగా జీసీసీ చేస్తున్న కృషికి ఫలితంగా.. అరకు కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది. అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అరకు కాఫీకి.. ఆర్గానిక్ బ్రాండ్ మరింత క్రేజ్ తేనుంది.

 

అరకు లోయ ప్రకృతి అందాలకే కాదు.. కాఫీ తోటలకు కూడా కేరాఫ్. అరకులో పండే కాఫీకి దేశీయంగానే కాదు.. అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడదే కాఫీకి మరో అరుదైన గుర్తింపు దక్కింది. గిరిజనుల సహకారంతో జీసీసీ మరో మైలురాయి అధిగమించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి డివిజన్ పరిధిలోని.. గొందిపాకలు, లంబసింగి, కప్పాలు క్లస్టర్లలో 1300 మంది గిరిజన రైతులు 2 వేల 184 ఎకరాల్లో పండిస్తున్న కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికెట్ సాధించడం కోసం నాలుగేళ్లుగా కృషి చేస్తున్నారు. అది ఫలించి.. అరకు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు పండించే కాఫీ, మిరియాలకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ లభించింది.

 

తొలుత గొందిపాకలు గ్రామానికి చెందిన రైతులు సేంద్రియ సాగులో ముందున్నారు. గ్రామంలోని రైతులంతా కలసి గిరిజన గ్రామ స్వరాజ్య సంఘంగా ఏర్పడి సేంద్రియ సాగుకు శ్రీకారం చుట్టారు. ఎరువులు వేయకుండా సేంద్రియ పద్ధతుల్లోనే కాఫీ, అంతరపంటగా మిరియాలను పండిస్తున్నారు. గొందిపాకలుతో పాటు లంబసింగి, కప్పలు గ్రామాల్లోని రైతులతో సమావేశాలు నిర్వహించిన జీసీసీ, సేంద్రియ సాగును ప్రోత్సహించింది. దీంతో మూడేళ్లుగా క్రమం తప్పకుండా స్కోప్ సర్టిఫికెట్ వచ్చేలా జీసీసీ కృషి చేసింది. మూడేళ్లపాటు దీనిపై సునిశిత అధ్యయనం పూర్తికావడంతో.. నాలుగో ఏడాది సేంద్రీయ సాగు ధ్రువపత్రంతో గుర్తింపు దక్కింది.

 

తొలి విడతలో చింతపల్లి మండలంలోని కాఫీ సాగు చేస్తున్న దాదాపు 1,300 మంది గిరిజన రైతులకు సేంద్రియ ధ్రువపత్రాలు అందించనున్నారు. ఇక.. జీకే వీధి, పెదవలస, యెర్రచెరువులు క్లస్టర్లలో మరో 1,300 మంది రైతులు సుమారు 3 వేల 393 ఎకరాల్లో కాఫీ, మిరియాలు సాగు చేస్తున్నారు. త్వరలోనే వాటికి కూడా ఆర్గానిక్ సర్టిఫికేషన్ ప్రక్రియ మొదలుకానుంది. వచ్చే ఏడాది జనవరి నాటికి వాటికీ.. సేంద్రియ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు.

 

ఒక పంటకు సేంద్రీయ ధ్రువపత్రం సాధించడం అంత తేలిక కాదు. ఇందుకు.. పెద్ద కసరత్తే ఉంటుంది. థర్డ్ పార్టీ వెరిఫికేషన్, ప్రతి అంశం ఆన్‌లైన్ వెరిఫికేషన్, ఆన్‌లైన్ అప్‌డేషన్, ప్రతి రైతుకి చెందిన వ్యవసాయ క్షేత్రాన్ని జియో ట్యాగింగ్ చేయడం, వాటిని.. ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడం లాంటివన్నీ.. ఎంతో జాగ్రత్తగా నిర్వహించాలి. వీటన్నింటిని.. జీసీసీ అధికారులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేశారు. అరకు కాఫీకి.. ఆర్గానిక్ సర్టిఫికేషన్ దక్కడంతో.. రాబోయే రోజుల్లో కాఫీతో పాటు మిరియాలకు మంచి గిట్టుబాటు ధర దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.