Telangana Politics: బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తున్న బీజేపీ, బీఆర్ఎస్.. పొన్నం ప్రభాకర్
ఈటల ఆరోపణలపై రేవంత్ అమ్మవారిపై ప్రమాణం చేస్తే స్పందించలేదు. కేసీఆర్ పన్నిన పన్నాగంతో ఈటలను బయటకు పంపించేందుకు బీజేపీ చేసిన పన్నాగం ఇది. కవితను, కేటీఆర్‌ను జైల్లో పెడతా.. జైల్లో పెడతానన్న బండి సంజయ్యే ఇప్పటికి రెండు సార్లు జైలుకు వెళ్లాడు

Ponnam Prabhakar
Telangana Politics: తెలంగాణలో భారతీయ జనతా పార్టీ, భారత్ రాష్ట్ర సమితి పార్టీలు బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తున్నాయని కాంగ్రెస్ నేత, కరీంగనర్ డీసీసీ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. నువ్వు కొట్టినట్లు చేస్తే నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరు పార్టీలపై విమర్శలు గుప్పించారు.
‘‘ఈటల ఆరోపణలపై రేవంత్ అమ్మవారిపై ప్రమాణం చేస్తే స్పందించలేదు. కేసీఆర్ పన్నిన పన్నాగంతో ఈటలను బయటకు పంపించేందుకు బీజేపీ చేసిన పన్నాగం ఇది. కవితను, కేటీఆర్‌ను జైల్లో పెడతా.. జైల్లో పెడతానన్న బండి సంజయ్యే ఇప్పటికి రెండు సార్లు జైలుకు వెళ్లాడు. మునుగోడు ఎన్నికలయ్యాక ఆరు నెలల తర్వాత ఈ ఆరోపణల వెనక రాజకీయమే ఉంది. ఇలాంటి పిచ్చి ప్రేళాపనలు మానుకోవాలి. రాళ్లవాన పడి కరీంనగర్ పార్లమెంటు రైతులు ఇబ్బందులు పడినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నడు? నీవు (బండి సంజయ్) కార్పోరేటర్‌కు ఎక్కువ మేయర్‌కు తక్కువ. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ డబ్బులు పంపించారనడం అర్థంలేని ఆరోపణలు. ఎంపీగా నియోజకవర్గానికి ఏం చేసావో చెప్పాలి. శివం, శవాలు లాంటి క్రాక్ మాటలు వద్దు. బండి సంజయ్ చిల్లర ఆరోపణలు మానుకోవాలి’’ అని పొన్నం ప్రభాకర్ అన్నారు.